November 4, 2026
Explore
దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలోని వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి

దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలోని వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి

November 4, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి

తిరుమలలోని వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ ను దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచేలా అభివృద్ధి చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారు.

తిరుమలలోని వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ లో బుధవారం ఆయుధపూజను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ల్యాబ్‌లోని కార్యకలాపాలు, పనితీరుపై అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చి 21న ప్రారంభించిన ఈ ఫుడ్ అండ్ వాటర్ అనాలసిస్ ల్యాబొరేటరీని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సహకారంతో కేవలం 11 నెలల్లోనే అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలోని ఇతర ఆలయాలు, దేవాదాయ సంస్థల్లో లేని విధంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ ల్యాబ్‌ను నిర్మించినట్లు పేర్కొన్నారు.

ల్యాబ్ నిర్వహణ కోసం ప్రస్తుతం అంతర్గత సిబ్బందితో పాటు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషన్ నుంచి డిప్యుటేషన్‌పై తీసుకున్న సిబ్బందితో కలిపి మొత్తం 34 మంది పనిచేస్తున్నారని తెలిపారు. పూర్తిస్థాయిలో ల్యాబ్ నిర్వహణకు మరో ఎనిమిది మంది అవసరమని, త్వరలో వారిని కూడా నియమించి మొత్తం 42 మంది అర్హత కలిగిన సిబ్బందితో అన్ని విభాగాలను నిర్వహించనున్నట్లు వివరించారు.

టీటీడీకి అవసరమైన ఆహార పదార్థాల కొనుగోలు దశ నుంచే నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అదనపు ఈవో తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన సిబ్బందితో నమూనాలను సేకరించి పరీక్షించిన అనంతరమే నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న పదార్థాలను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. వంట పూర్తయిన తర్వాత కూడా ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నట్లు తెలిపారు.

ఇటీవల నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో సుమారు 2,500 ఆహార నమూనాలను సేకరించి పరీక్షించినట్లు తెలిపారు. ప్రతిరోజూ తాగునీటి నమూనాలను కూడా పరీక్షిస్తున్నట్లు వివరించారు. లడ్డూ నాణ్యతను పరిశీలించేందుకు సుమారు 11 రకాల పారామీటర్లను పరీక్షించే అత్యాధునిక పరికరాలు ల్యాబ్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

చిన్న, పెద్ద లడ్డూలలో జీడిపప్పు పరిమాణం, తేమ శాతం, నీటి శాతం, చక్కెర, సిరప్ తదితర అంశాలను కూడా విశ్లేషించే సదుపాయం ఉందన్నారు. లడ్డూలోని పోషక విలువలను సైతం అంచనా వేయగలుగుతున్నట్లు తెలిపారు.

సాంబార్ రైస్, వండిన అన్నం, కొనుగోలు చేసే బియ్యం, డ్రై ఫ్రూట్స్ తదితర పదార్థాల నాణ్యతను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రమాణాల ప్రకారం పరీక్షిస్తున్నట్లు తెలిపారు. డ్రై ఫ్రూట్స్‌లో ముక్కల నాణ్యత, పొడి శాతం వంటి అంశాలను పరిశీలించి ప్రమాణాలకు అనుగుణంగా లేని పదార్థాలను తిరస్కరిస్తున్నట్లు వివరించారు.

అలాగే నెయ్యి నమూనాలను ప్రతిరోజూ సేకరించి పరీక్షించిన తర్వాతే వినియోగానికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. నాణ్యతా ప్రమాణాలను పాటించకపోతే సరఫరాదారులపై చర్యలు, బ్లాక్‌లిస్ట్ చేసే అవకాశం ఉండటంతో వారు కూడా ముందస్తుగా పరీక్షలు నిర్వహించి నాణ్యమైన పదార్థాలను సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఫలితంగా సరఫరా చేసిన పదార్థాల్లో దాదాపు 99 శాతం వరకు ఎలాంటి తిరస్కరణలు ఎదురుకాలేదని పేర్కొన్నారు.

తిరుమలలో నిరంతరం కొనసాగుతున్న అన్నప్రసాదం, లడ్డూ తయారీ, తాగునీటి సరఫరా వంటి కార్యకలాపాల్లో నాణ్యతా ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అదనపు ఈవో తెలిపారు. అర్హత కలిగిన సిబ్బంది, అత్యాధునిక పరికరాలు, నిర్దిష్ట పరీక్షా విధానాలతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నట్లు చెప్పారు.

ల్యాబ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని విభాగాలు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించామని తెలిపారు. భక్తులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన ఆహారం, తాగునీరు అందించే విషయంలో టీటీడీ దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఈ ల్యాబ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ హెల్త్ డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, ప్రొక్యూర్‌మెంట్ జీఎం ఉమాశంకర్, ల్యాబ్ క్వాలిటీ మేనేజర్ లక్ష్మీనారాయణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tasgs: Water and Food Analysis Lab in Tirumala developed to serve as a model for the entire nation