November 4, 2026
Explore
నవంబరు 8న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం

నవంబరు 8న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం

November 4, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

నవంబరు 6న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో నవంబరు 8వ తేదీన దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా నవంబరు 8వ తేదీ రాత్రి 7 గంటలకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలను తీసుకువచ్చి శ్రీ కోదండరామస్వామివారికి సమర్పించనున్నారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం వైభవంగా నిర్వహిస్తారు.

దీపావళి ఆస్థానం సందర్భంగా అమావాస్య రోజున ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకం సేవ, హనుమంత వాహనసేవను టీటీడీ రద్దు చేసింది.

నవంబరు 6న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

దీపావళి ఆస్థానాన్ని పురస్కరించుకుని నవంబరు 6వ తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.

ఆ రోజు తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 నుండి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పులు, పూజా సామగ్రి తదితరాలను పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన పవిత్ర పరిమళ మిశ్రమాన్ని ఆలయం అంతటా పూస్తారు.

ఈ పవిత్ర కార్యక్రమం అనంతరం ఉదయం 10.30 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

Tags:Deepavali Asthanam celebrated grandly at the Sri Kodandarama Swamy Temple on November 8