March 30, 2026
Explore
ఢిల్లీ విమానాశ్రయంలో 1.4 కిలోల అసలైన బంగారంతో పట్టుబడ్డ కొండా విజయ్ కుమార్

ఢిల్లీ విమానాశ్రయంలో 1.4 కిలోల అసలైన బంగారంతో పట్టుబడ్డ కొండా విజయ్ కుమార్

March 30, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:

ఢిల్లీ విమానాశ్రయంలో 1.4 కిలోల అసలైన బంగారంతో పట్టుబడ్డ కొండా విజయ్ కుమార్ కేసును విచారిస్తుండగా సూర్య భాయ్ (అసలు పేరు పల్లాపు సురేష్ కుమార్) పేరు వెలుగులోకి వచ్చింది.

ఫోన్ డేటా, సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఆధారంగా ఇతడిని గుర్తించిన అధికారులు శుక్రవారం సాయంత్రం విచారణకు పిలిచారు. ఆ సమయంలో అతను 12 రకాల ఆభరణాలు ధరించి వచ్చాడు. మొదట ఆ నగలు సుమారు కోటి రూపాయల విలువ చేస్తాయని అధికారుల ముందు ప్రగల్భాలు పలికాడు. కానీ, విచారణ ముదురుతున్న కొద్దీ మాట మార్చాడు. ఐటీ శాఖ వాల్యూయర్లు ఆ నగలను పరీక్షించగా, వాటి మొత్తం విలువ కేవలం రూ. 3 లక్షలు మాత్రమేనని తేలింది.

అతను ధరించిన నగల్లో చాలా వరకు రాగిపై రోడియం కోటింగ్ పూసినవని. ఒక నగ మాత్రం వెండిపై బంగారు పూత పూసినదని అధికారులు గుర్తించారు. ప్రజల ముందుకు వచ్చిన ప్రతిసారి అతను దాదాపు 32 రకాల ఇమిటేషన్ (నకిలీ) నగలను మార్చి మార్చి వాడేవాడని, అవి రంగు వెలిసిపోయినప్పుడల్లా కొత్తవి కొనేవాడని విచారణలో తేలింది. యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా తాను ఒక ధనవంతుడైన ‘గోల్డ్ మ్యాన్’ అని అతను కలరింగ్ ఇచ్చేవాడని అధికారులు తెలిపారు.

అతని ఆర్థిక రికార్డులు పరిశీలించగా, ఆ బిల్డప్‌కు తగ్గట్టుగా ఏమీ లేవని స్పష్టమైంది. గత ఆరేళ్లలో కేవలం 2022-23 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే అతను ఐటీ రిటర్న్స్ దాఖలు చేశాడు. అందులో తన వార్షిక ఆదాయం కేవలం రూ. 4.9 లక్షలుగా చూపాడు. జిమ్ ట్రైనర్‌గా, చికెన్ షాప్ యజమానిగా ఈ ఆదాయం వస్తున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాకుండా, అతని పేరు మీద గానీ, అతని భార్య పేరు మీద గానీ ఎలాంటి స్థిరాస్తులు లేవని, ప్రస్తుతం నెలకు రూ. 20,000 అద్దె చెల్లిస్తూ ఒక ఫ్లాట్‌లో ఉంటున్నారని అధికారులు గుర్తించారు.

అతని వద్ద థార్, సఫారీ, ఎండీవర్ వంటి కార్లు, బుల్లెట్ బైక్ ఉన్నప్పటికీ.. అవి కేవలం ప్రదర్శన కోసమేనని, భూ వివాదాల సెటిల్‌మెంట్లలో వచ్చే కమిషన్లతో వాటిని కొనుగోలు చేసినట్లు అధికారులు నిర్ధారించారు. అలాగే అతను నడుపుతున్నట్లు చెప్పుకునే ‘SNS ప్రజా సేవా ఫౌండేషన్’, వృద్ధాశ్రమానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ గానీ, పాన్ కార్డు గానీ లేవని తేలింది.

విచారణలో సూర్య భాయ్ తన అసలు ఉద్దేశాన్ని బయటపెట్టాడు. సినిమాల్లో అవకాశాల కోసం, అందరి దృష్టిని ఆకర్షించడానికే తాను ఇలా బంగారు నగలతో హడావుడి చేసినట్లు అంగీకరించాడు. ఇప్పటికే ‘ఘటికుడు’ సహా రెండు సినిమాల్లో చిన్న పాత్రలు పోషించినట్లు అతను తెలిపాడు. విచారణ అనంతరం అతడిని విడిచిపెట్టిన అధికారులు, విజయ్ కుమార్‌కు సంబంధించిన ప్రధాన కేసుపై విచారణ కొనసాగిస్తున్నారు.

Tags: Konda Vijay Kumar caught with 1.4 kg of genuine gold at Delhi Airport.