విజయనగరం ముచ్చట్లు:
- విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్
🌀29మంది విద్యార్థినులకు మలబార్ గోల్డ్ (సి.ఎస్.ఆర్) స్కాలర్ షిప్స్ ను ప్రధానం చేసిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్
🌀కార్పొరేట్ సామాజిక బాధ్యతగా పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్న మలబార్ గోల్డ్ యాజమాన్యాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ
🌀 విద్యార్థినులు విద్యపైనే దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్
విజయనగరం పట్టణంలోని మలబార్ గోల్డ్ & డైమండ్స్ యాజమాన్యం కార్పొరేట్ సామాజిక బాధ్యతగా పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివే విధముగా ప్రోత్సహించేందుకు స్కాలర్ షిప్స్ ప్రదానం చేసే కార్యక్రమంను మార్చి 29న ఫోర్డ్ సిటీ సెంటర్ మాల్ నందు చేపట్టింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరై, 29మంది పేద విద్యార్థులకు రూ.2.32 లక్షల స్కాలర్ షిప్స్ ను ప్రధానం చేసారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ మాట్లాడుతూ – మలబార్ గోల్డ్ & డైమండ్స్ యాజమాన్యం ప్రతీ ఏడాది తమ సంస్థకు వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) గా పేద విద్యార్థుల ఉన్నతికి ఖర్చు చేయడం అభినందనీయమన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 29మంది మెరిట్ విద్యార్థులను ఎంపిక చేసి, వారికి రూ.2.32 లక్షలను స్కాలర్ షిప్స్ గా అందజేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువుకొనే వయస్సులో సోషల్ మీడియాకు అలవాటు పడవద్దని, ఏకాగ్రతతో ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. మీ అభ్యున్నతికి నిరంతరం తపించే తల్లిదండ్రులు, మార్గనిర్దేశం చేసే ఉపాధ్యాయుల మాటలను వినాలని, వారి సూచనలను పాటిస్తూ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. భవిష్యత్తులో మిమ్ములను ఉన్నతంగా నిలిపేది విద్య ఒకటేనని, కావున, చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని విద్యార్థినులకు జిల్లా ఎస్పీ సూచించారు. ఉన్నత చదువులను చదివితే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో తప్పనిసరిగా మంచి అవకాశాలు, ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఇంటర్నెట్ ను విద్యను అభ్యసించడానికి, తెలియని విషయాలు తెలుసుకోవడానికి వినియోగించుకోవాలన్నారు. అలా కాకుండా, సోషల్ మీడియా మోజులోపడి చదువును నిర్లక్ష్యం చేస్తే లక్ష్యంకు దూరం అవుతామన్న వాస్తవాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు చదువు చెప్పడంతోపాటు మానవత విలువలు, వారి భవిష్యత్తుకు ఉపయోగపడే విషయాలు, ప్రణాళికలు గురించి ఉద్భోదించాలన్నారు. విద్యార్థులు లక్ష్యం చేరుకొనే విధంగా వారిని ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని, సోషల్ మీడియాకు, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని విద్యార్థులకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పిలుపునిచ్చారు.
మలబార్ గోల్డ్ & డైమండ్స్ స్టోర్ హెడ్ జుమ్రాత్ రెహమాన్ మాట్లాడుతూ – మలబార్ గోల్డ్ యాజమాన్యం తమ సంస్థకు వచ్చిన లాభాల్లో రూ.200 కోట్లను ప్రపంచ వ్యాప్తంగా CSR కార్యక్రమాల నిర్వహణకు ఖర్చు చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 2800 విద్యార్థులకు రూ.2.52 కోట్లను స్కాలర్ షిప్స్ గా అందజేస్తున్నారన్నారు.
మలబార్ గోల్డ్ యాజమాన్యం ప్రపంచ వ్యాప్తంగా చేపడుతున్న CSR కార్యక్రమాల వివరాలతో కూడిన A.V.ని ఈ సందర్భంగా ప్రదర్శించారు.
మలబార్ గోల్డ్ & డైమండ్స్ యాజమాన్యం చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పి ఎ.ఆర్.దామోదర్ గార్ని స్టోర్ హెడ్ మరియు సిబ్బంది ప్రత్యేకంగా అభినందించి, కృతజ్ఞతలు తెలిపి, శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం స్టోర్ హెడ్ జుమ్రాత్ రెహమాన్, స్టోర్ మేనేజర్ శివరామ రాజు, వన్ టౌన్ సిఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ఎస్ఐ సంభాన రవి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, మెరిట్ స్కాలర్ షిప్స్ పొందిన విద్యార్థినులు మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags: One can reach great heights only through education.