October 29, 2026
Explore
నోట్ల కట్టలు తెగితేనే ఓటు !

నోట్ల కట్టలు తెగితేనే ఓటు !

October 29, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఖరీదెక్కిన స్థానిక ఎన్నికలు

స్థానిక సంస్థల ఎన్నికలు బాగా ఖరీదయ్యాయి. నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచి పోలింగ్ ముగిసి, ఓట్ల ఫలితం వచ్చేవరకు అభ్యర్థుల నుంచి నోట్ల కట్టలు తెగాల్సిందే. భూములు తాకట్టుపెట్టడం, తెలిసిన వారి దగ్గర చేబదులు తీసుకోవడం, కాంట్రాక్టర్ల నుంచి ఒప్పందాలు చేసుకుని పెట్టుబడులు సమకూర్చుకుని స్థానిక సంగ్రామానికి తెర తీయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎన్నికల నిబంధనలను పక్కన పెట్టి గెలుపే ధ్యేయంగా ఓట్లకు నోటు పంచకుండా ఎన్నికల పోలింగ్ జరగడనేది తేలిపోయింది. కనీసం రూ.500, పోటీ ఉంటే రూ.వెయ్యి పంచాల్సిందేనన్న పరిస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు మొదలుకుని గ్రామస్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలవరకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. ప్రచారం ఖర్చు, పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు, భారీగా వాహనాలు, అద్దె కార్యకర్తలు, జెండాలు, రోజువారీ ప్రచారాలు, బలహీన వర్గాల హామీలకు వేలకు వేలు పంపిణీలతో ఓట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చెప్పిన లెక్కలకు ఐదారు రెట్లు ఖర్చు పెట్టాల్సి వస్తోంది.

Tags;A vote, only if bundles of currency notes are handed over!