October 22, 2026
Explore
చిత్తూరు ఏకగ్రీవాలపై కలెక్టర్ సీరియస్

చిత్తూరు ఏకగ్రీవాలపై కలెక్టర్ సీరియస్

October 22, 2026 | Andhra Pradesh

చిత్తూరుముచ్చట్లు:

24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఆర్వోలకు నోటీసులు జారీ

ఉపసంహరణల వెనుక కారణాలపై ప్రశ్నల వర్షం

బీ-ఫారాల చింపివేత, సిబ్బందిపై దాడి ఘటనలపై కమిషనర్‌కు ఆదేశాలు

చిత్తూరు నగరపాలక సంస్థ (కార్పొరేషన్) ఎన్నికల్లో ఏకంగా 51 డివిజన్లు ఏకగ్రీవం కావడంపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏకగ్రీవాల వ్యవహారంపై 24 గంటల్లోగా రాతపూర్వక నివేదిక సమర్పించాలని రిటర్నింగ్ అధికారులందరికీ (ఆర్వోలకు) ఆయన గురువారం నోటీసులు జారీ చేశారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో పాటు వామపక్షాలు, స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ పత్రాలను దొంగ సంతకాలతో ఉపసంహరించుకునేలా చేయడం వల్లే 51 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్‌ఈసీ) ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయపోరాటానికి సైతం సిద్ధమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించారు.

ఆర్వోలకు కలెక్టర్ సంధించిన ప్రశ్నలు..

నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు?

నేరుగా ఎవరు వచ్చి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు?

ఉపసంహరణకు వారు తెలిపిన కారణాలు ఏమిటి?
అభ్యర్థులు, ప్రతిపాదకుల ధ్రువీకరణను అధికారులు స్వయంగా పరిశీలించారా?

ఈ ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన రాతపూర్వక సమాధానాలు ఇవ్వాలని ఆర్వోలను కలెక్టర్ ఆదేశించారు. వీటితో పాటు కార్పొరేషన్ కార్యాలయంలో చోటుచేసుకున్న బీ-ఫారాల చింపివేత, ప్రభుత్వ ఉద్యోగిపై జరిగిన దాడి, కెమెరాల ధ్వంసం ఘటనలపైనా సమగ్ర నివేదిక ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు.

కలెక్టర్ తాజా ఆదేశాలతో రిటర్నింగ్ అధికారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నివేదికలో పూర్తి వాస్తవాలు వెల్లడించాలా, లేదా అన్న సందిగ్ధంలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ 51 డివిజన్ల ఏకగ్రీవాల వ్యవహారం చివరకు ఏ అధికారి మెడకు చుట్టుకుంటుందో, ఎవరి ఉద్యోగానికి ముప్పు తెస్తుందోనని స్థానికంగా తీవ్ర చర్చ సాగుతోంది.

Tags:Collector takes a serious view of unanimous elections in Chittoor