నిబంధనలు అతిక్రమిస్తే అనర్హత వేటు తప్పదు!
అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ గారు.
మదనపల్లెముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో త్వరలో జరగనున్న పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలను నూరు శాతం పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే పోలీసు శాఖ లక్ష్యం. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని (Model Code of Conduct) తుచ తప్పకుండా పాటించాలి. ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగేందుకు జిల్లా పోలీసు శాఖ జారీ చేసిన ముఖ్యమైన మార్గదర్శకాలు, ఉల్లంఘిస్తే తీసుకునే చర్యల వివరాలను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి . పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేశారు.
అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు ముఖ్యమైన నిబంధనలు:
- వేర్వేరు పార్టీలకు చెందిన అభ్యర్థులు ఒకే సమయంలో, ఒకే మార్గంలో ర్యాలీగా వెళ్లరాదు. ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చి, సూచించిన సమయాల్లో మాత్రమే వెళ్లాలి.
ఒకేసారి వచ్చి ఘర్షణ పడితే సంబంధిత అభ్యర్థులపై అల్లర్లు (Rioting), ప్రభుత్వ విధులకు ఆటంకం కింద కేసులు నమోదు చేసి, తక్షణమే అరెస్ట్ చేయడం జరుగుతుంది.
- సభలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించే వారు 48 గంటల ముందే పోలీసు అనుమతి తీసుకోవాలి. ప్రచార వాహనాలకు పాస్ తప్పనిసరి. ఒకే ప్రాంతంలో రెండు పార్టీలు ఒకేసారి సభలు పెట్టకూడదు.
అనుమతి లేని సభలు, ర్యాలీలపై కేసులు నమోదు చేసి, ఎన్నికలు ముగిసే వరకు ప్రచార వాహనాలను సీజ్ చేస్తారు.
- ర్యాలీలు నిర్వహించడానికి పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరి.
పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయి.
- ఉదయం 06:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు మాత్రమే మైకులు వాడాలి. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాల వద్ద (సైలెంట్ జోన్స్) వాడరాదు.
నిబంధనలు మీరితే సౌండ్ సిస్టమ్, వాహనాలను సీజ్ చేసి, పర్యావరణ పరిరక్షణ మరియు పోలీసు చట్టాల కింద జరిమానాలు విధిస్తారు.
- ఓటర్లను ఆకర్షించేందుకు మద్యం, నగదు, బహుమతులు పంపిణీ చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరం.
పట్టుబడితే ఎన్నికల అధికారులకు నివేదించి అభ్యర్థిత్వం రద్దు (అనర్హత వేటు) చేయిస్తారు. అక్రమ రవాణా చేసే వారిని నాన్-బెయిలబుల్ కేసుల కింద రిమాండ్కు తరలిస్తారు.
- ప్రత్యర్థి పార్టీలపై వ్యక్తిగత దూషణలు, కుల-మత విద్వేషాలను రెచ్చగొట్టేలా అసత్య ప్రచారాలు (Fake News), మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేయరాదు. వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ (X) వంటి వాటిపై పోలీసు నిఘా ఉంటుంది.
ఐటీ చట్టం (IT Act) మరియు సైబర్ క్రైమ్ నిబంధనల కింద పోస్ట్ చేసిన వ్యక్తులతో పాటు, గ్రూప్ అడ్మిన్లపై కఠిన కేసులు నమోదు చేసి జైలుకు పంపుతారు.
- ప్రత్యర్థి పార్టీలపై వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ఇతరుల ప్రచారాలకు ఆటంకం కలిగించడం, ఫ్లెక్సీలు చించివేయడం నిషిద్ధం.
దౌర్జన్యం, ఆస్తుల ధ్వంసం (Damage to Property Act) కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు.
- ప్రైవేట్ ఇళ్లపై అనుమతి లేకుండా ఫ్లెక్సీలు కట్టడం నిషిద్ధం. ప్రభుత్వ ఆస్తులపై ఎలాంటి ప్రచార సామగ్రి ఏర్పాటు చేయరాదు.
అనుమతి లేకుండా ఫ్లెక్సీలు కడితే ఎన్నికల ఖర్చు ఖాతాలో చేర్చడమే కాకుండా, పబ్లిక్ ప్రాపర్టీ డిఫేస్మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారు.
- సరైన పత్రాలు, ఆధారాలు లేకుండా ఎవరూ కూడా రూ. 50,000 కంటే ఎక్కువ నగదును రవాణా చేయరాదు.
తనిఖీల్లో సరైన పత్రాలు లేని రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు ఉంటే సీజ్ చేస్తారు.
- సరైన పత్రాలు, ఆధారాలు లేకుండా విలువైన వస్తువులు రవాణా చేయరాదు.
తనిఖీల్లో పట్టుబడితే సీజ్ చేయడం జరుగుతుంది.
- లైసెన్స్డ్ ఆయుధాలను వెంటనే పోలీసులకు డిపాజిట్ చేయాలి.
గొడవలు సృష్టించే రౌడీషీటర్లు, పాత నేరస్థులపై ఇప్పటికే బైండోవర్లు (Bind over) చేయడం జరిగింది. వాటిని ఉల్లంఘిస్తే నేరుగా జైలుకే పంపుతారు.
“స్థానిక ఎన్నికలు మన ఊరి భవిష్యత్తును నిర్ణయించేవి. వీటిని పండుగ వాతావరణంలో బాధ్యతాయుతంగా జరుపుకుందాం. ఓటర్లు ఎలాంటి భయాలు, ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. అభ్యర్థులు హుందాగా వ్యవహరించాలి. కేవలం గెలవాలన్న కసితో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా, అడ్డదారులు తొక్కినా వారిపై జీవితకాలం మాయని మచ్చలా క్రిమినల్ కేసులు నమోదవుతాయి. ప్రశాంత ఎన్నికల కోసం జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలి.” – జిల్లా ఎస్పీ..
ఫిర్యాదులు మరియు సమాచారం కోసం:
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, డబ్బు/మద్యం పంపిణీ, బెదిరింపులకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు నిర్భయంగా పోలీసులకు తెలియజేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతాము.అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీస్ స్టేషన్ కు లేదా పోలీస్ ఎమర్జెన్సీ: డయల్ 100/112 కు కాల్ చేయాలని సూచించారు.
Tags:Guidelines for local body elections: