అమరావతిముచ్చట్లు:
బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఉత్తర అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి సరికొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో మరోమారు వర్షాలు కురిసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడబోయే ఈ అల్పపీడనం తదుపరి 3 నుంచి 4 రోజుల్లో మరింతగా బలపడనుంది. అనంతరం ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల దిశగా పయనించే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గాలుల తీవ్రత పెరగడంతో పాటు మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాయుగుండంగా మారుతుందా..?
ఈ అల్పపీడనం తీవ్రతపై అంతర్జాతీయ, జాతీయ వాతావరణ మోడల్స్ భిన్నమైన అంచనాలను వెల్లడిస్తున్నాయి. బుధవారం నాటికి ఇది తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారవచ్చని కొన్ని వాతావరణ నమూనాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు ఇది వాయుగుండంగా మారకుండా సాధారణ అల్పపీడనంగానే తీరం వైపు కొనసాగుతుందని మరికొన్ని మోడల్స్ సూచిస్తున్నాయి. ఈ వ్యవస్థ తీవ్రత, కదిలే కచ్చితమైన మార్గంపై రాబోయే 24 నుంచి 48 గంటల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.యంత్రాంగం అప్రమత్తం
తీరప్రాంత ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను గమనిస్తూ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అల్పపీడనం బలపడే కొద్దీ సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉండటంతో వేటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. స్థానిక అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
Tags: Disturbance in the Bay of Bengal… another low-pressure area approaching… heavy rains in AP!