October 9, 2026
Explore
బాలభటులు ప్రపంచస్థాయి పౌరులుగా ఎదగాలి

బాలభటులు ప్రపంచస్థాయి పౌరులుగా ఎదగాలి

October 9, 2026 | Andhra Pradesh

స్కౌట్ శిక్షణతో క్రమశిక్షణ, సేవాభావం పెంపొందుతాయి

నూతన స్కౌట్, గైడ్ యూనిట్ల ప్రారంభోత్సవంలో జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి

మోటకట్ల ముచ్చట్లు:

విద్యార్థులు స్కౌటింగ్‌లో పాల్గొని క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడంతోపాటు ప్రపంచస్థాయి పౌరులుగా ఎదగాలని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం సంబేపల్లి మండలం మోటకట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన స్కౌట్, గైడ్ యూనిట్లను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌటింగ్ శిక్షణ విద్యార్థుల్లో సేవాభావం, దేశభక్తి, నైతిక విలువలను పెంపొందిస్తుందని తెలిపారు. శారీరక, మానసిక వికాసానికి స్కౌటింగ్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. స్కౌటింగ్‌లో శిక్షణ పొంది ధ్రువపత్రాలు పొందిన విద్యార్థులకు ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 27 ప్రకారం ట్రిపుల్ ఐటీ, పాలిటెక్నిక్, వైద్య విద్య వంటి కోర్సుల్లో ప్రవేశాలు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి రిజర్వేషన్ సౌకర్యాలు ఉన్నాయని వివరించారు.

ప్రతి పాఠశాలలో స్కౌట్ యూనిట్ల ఏర్పాటుకు ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలని, విద్యార్థులు స్కౌటింగ్‌ను సద్వినియోగం చేసుకుని సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అనంతరం పాఠశాలకు చెందిన 17 మంది స్కౌట్ విద్యార్థులకు, 15 మంది గైడ్ విద్యార్థినులకు యూనిఫామ్‌లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, అడ్వాన్స్‌డ్ గైడ్ కెప్టెన్ చప్పిడి పద్మజ, స్కౌట్ యువ ఆపద మిత్ర నోడల్ అధికారి మురళి నాయక్, స్కౌట్ మాస్టర్లు నరసింహాలు, వేణుమాధవ్ రాజు, గైడ్ కెప్టెన్ పద్మావతి, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags; Young scouts must grow into global citizens.