October 8, 2026
Explore
స్థానిక ఎన్నికల్లో బాబు-పవన్ పొత్తు

స్థానిక ఎన్నికల్లో బాబు-పవన్ పొత్తు

October 8, 2026 | Andhra Pradesh

– అగ్రనేతల లెక్కలు ఓకే.. మరి క్షేత్రస్థాయి కేడర్ సమన్వయం సాధ్యమేనా?

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనున్న వేళ, అధికార ఎన్డీయే కూటమిలో సీట్ల సర్దుబాటు అత్యంత సంక్లిష్టమైన ఘట్టంగా మారింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండవల్లిలో సమావేశమై పొత్తులు, మేయర్, జెడ్పీటీసీ, చైర్పర్సన్ స్థానాల విభజనపై సుదీర్ఘంగా చర్చించారు. అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో అగ్రనేతలు ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే నియోజకవర్గ స్థాయి వరకు కేడర్ క్రమశిక్షణతో పనిచేసింది. కానీ, గ్రామీణ, పట్టణ స్థాయి పోలింగ్ బూత్ల వద్ద ముఖాముఖి తలపడే స్థానిక పోరులో కేవలం బాబు-పవన్ల భేటీలు, పిలుపులు కింది స్థాయి శ్రేణులను పూర్తిగా ఒకే తాటిపైకి తేగలవా అనేది ఇప్పుడు ఏపీ రాజకీయంలో అసలైన ప్రశ్న.

జనసేన క్యాడర్ ఆశలు ఎక్కువే!

శాసనసభ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ సాధించిన తర్వాత జనసేన కేడర్ ఆత్మవిశ్వాసం, ఆకాంక్షలు ఆకాశాన్ని తాకాయి. సార్వత్రిక ఎన్నికల సమయాన రాష్ట్ర ప్రయోజనాల కోసం 21 సీట్లకే పరిమితమయ్యామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం తమ ఆత్మగౌరవానికి భంగం కలగనివ్వబోమని పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన ముఖ్య నేతలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో జనసేన గ్రాఫ్ బలంగా ఉందని, అసెంబ్లీ ఎన్నికల నాటి ఫార్ములా ఇక్కడ వర్తించదని కేడర్ ఇప్పటికే తెగేసి చెబుతోంది. 30 శాతానికి పైగా స్థానాలు దక్కించుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో సొంత నాయకత్వాన్ని బలపరుచుకోవాలని జనసేన పట్టుబడుతోంది.
టీడీపీ క్యాడర్ బలం ఉన్న చోట్ల వెనక్కి తగ్గదు!

అటు తెలుగుదేశం పార్టీకి గ్రామీణ ఏపీలో ఐదు దశాబ్దాల బలమైన ఓటు బ్యాంకు, బూత్ స్థాయి బలగాలు ఉన్నాయి. గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ వేధింపులు ఎదుర్కొని, స్థానికంగా పార్టీ జెండాను నిలబెట్టిన టీడీపీ గ్రామ స్థాయి నేతలు ఈసారి ఎలాగైనా పదవులు చేజిక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. చంద్రబాబు ఎన్ని సర్దుబాట్లు చెప్పినా.. తమకు దక్కాల్సిన సర్పంచ్, ఎంపీటీసీ లేదా కౌన్సిలర్ సీటును జనసేనకో, బీజేపీకో కేటాయిస్తే ఊరుకునే పరిస్థితి క్షేత్రస్థాయి టీడీపీ నేతల్లో లేదు. ఒకవేళ పార్టీ నుంచి అధికారికంగా బి-ఫామ్ రాకపోయినా ‘రెబెల్స్’గా అభ్యర్థులను దింపడానికో లేదా స్వతంత్రంగా పోటీ చేయడానికో స్థానిక టీడీపీ శ్రేణులు వెనుకాడేలా లేవు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఈ కూటమిలోని అసమ్మతిని అనుకూలంగా మార్చుకోవడానికి వేచి చూస్తోంది. నియోజకవర్గ స్థాయిలో చంద్రబాబు, పవన్ ఎంత మైత్రిని ప్రదర్శించినా, పంచాయతీ, వార్డు స్థాయిలో కుటుంబాలు, పాత కక్షలు, వ్యక్తిగత ప్రాబల్యాలే గెలుపోటములను శాసిస్తాయి. కూటమిలో సీటు దక్కని టీడీపీ లేదా జనసేన అసంతృప్త నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోవడం ఖాయం. ఆ చీలిక ద్వారా తాము పుంజుకోవచ్చని వైఎస్సార్సీపీ ఆశిస్తోంది. ఈ రకమైన సాంప్రదాయ స్థానిక వైరుధ్యాలను అగ్రనేతలు పైస్థాయి నుంచి నియంత్రించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
బలమున్న చోట పోటీ

ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేందుకు చంద్రబాబు బలం ఉన్న చోట మిత్రపక్షానికే ప్రాధాన్యం అనే ఫార్ములాను ప్రతిపాదించారు. అయితే, ఒక నిర్దిష్ట పంచాయతీలో లేదా వార్డులో టీడీపీకి ఎక్కువ బలముందా, లేక జనసేనకు ఉందా అని తేల్చడం కత్తిమీద సాము లాంటిది. పార్టీ కమిటీల నిర్వహణ, ఉమ్మడి సర్వేలు, నామినేటెడ్ పదవుల హామీలతో అసంతృప్తిని చల్లార్చాలని బాబు-పవన్ ప్రయత్నిస్తున్నప్పటికీ, అధికారం తలుపు తడుడుతున్న వేళ పదవుల కోసం ద్వితీయ శ్రేణి నేతల మధ్య పోటీ రాపిడికి దారితీస్తోంది. రాష్ట్రస్థాయిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ఐక్యత ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ, స్థానిక ఎన్నికలు అనేది పూర్తిగా కింది స్థాయి నాయకుల ఉనికి, భవిష్యత్తుకు సంబంధించిన అంశం. పంచాయతీ, మున్సిపాలిటీ స్థాయిలో చోటుచేసుకునే ఫ్రెండ్లీ ఫైట్లు లేదా తిరుగుబాట్లు ప్రధాన కూటమి ఐక్యతను దెబ్బతీయకుండా, కేడర్ను సమన్వయం చేయడమే అమరావతి పెద్దలకు రాబోయే రోజుల్లో అతిపెద్ద సవాలు కానుంది.

Tags: Babu-Pawan alliance in local elections