October 25, 2026
Explore
అన్నమయ్య జిల్లాలో తుపాను ముందస్తు చర్యలు చేపట్టాలి

అన్నమయ్య జిల్లాలో తుపాను ముందస్తు చర్యలు చేపట్టాలి

October 25, 2026 | Andhra Pradesh

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లె ముచ్చట్లు:

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో… అన్నమయ్య జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి, తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ముందస్తు జాగ్రత్తలు, సన్నద్ధత చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు, ముంపునకు గురయ్యే ఆవాసాలు, చెరువులు, నీటి వనరులు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలు తదితర ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన సిబ్బంది, వాహనాలు, యంత్రాలు, అత్యవసర పరికరాలు, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్యారోగ్య, గ్రామీణ నీటి సరఫరా, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్ వంటి అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులకు పంటల రక్షణపై సూచనలు అందించాలని, పశువుల సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

వాతావరణ హెచ్చరికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు అవసరమైన సమాచారం, ముందస్తు హెచ్చరికలను ఎప్పటికప్పుడు చేరవేయాలని సూచించారు. అధికారిక సమాచారాన్నే ప్రజలకు తెలియజేయాలన్నారు. అనవసర వదంతులు, నిర్ధారణ కాని సమాచారం ప్రచారం కారాదని, ఈ విషయంలో ప్రజలందరూ అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలన్నారు.

అన్ని ముందస్తు సన్నద్ధత చర్యలను పూర్తి చేసి గుర్తించిన ప్రమాదకర ప్రాంతాలు తదితర వివరాలతో కూడిన నివేదికలను రేపు మధ్యాహ్నం లోపు సమర్పించాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.

ఈనెల 30వ వరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

Tags: Precautionary measures for the cyclone must be taken in Annamayya district.