October 7, 2026
Explore
రోడ్డు ఆక్రమణలు, అక్రమ పార్కింగ్‌పై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక చర్యలు.

రోడ్డు ఆక్రమణలు, అక్రమ పార్కింగ్‌పై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక చర్యలు.

October 7, 2026 | Andhra Pradesh

  • 50 జరిమానాలు, 30 టౌన్ న్యూసెన్స్ కేసులు నమోదు.
  • 50 షాపు బోర్డులు తొలగించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు.
  • ఆక్రమణలు, అక్రమ పార్కింగ్‌పై నిరంతర నిఘా.

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీఎస్పీ డి. కొండయ్య నాయుడు పర్యవేక్షణలో తిరుపతి నగరంలో రోడ్డు ఆక్రమణలు, అక్రమ పార్కింగ్‌పై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ట్రాఫిక్ సీఐలు ఎం. భాస్కర్ నాయక్, సుబ్బరామిరెడ్డి, ఎస్‌ఐలు రవి, వెంకటేశ్వర్లు, నాగరాజు, రాజా పవన్ కుమార్ మరియు సిబ్బంది లక్ష్మీపురం సర్కిల్ నుంచి టీవీఎస్ సర్కిల్ మీదుగా అన్నమయ్య సర్కిల్ వరకు తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు, తోపుడు బండ్ల నిర్వాహకులు, అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేసిన వారిపై 50 జరిమానాలు విధించి, 30 టౌన్ న్యూసెన్స్ కేసులు నమోదు చేశారు. పాదచారులు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లు, ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసిన 50 షాపు బోర్డులను తొలగించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

షాపు యజమానులు రోడ్లు, ఫుట్‌పాత్‌లపై వ్యాపార సామగ్రి, బోర్డులు ఏర్పాటు చేయరాదని, వాహనాలను నో-పార్కింగ్ ప్రాంతాల్లో నిలపరాదని పోలీసులు సూచించారు. రద్దీ సమయాల్లో రోడ్లపై లోడింగ్, అన్‌లోడింగ్ చేయకుండా, పెద్ద వాణిజ్య సంస్థలు పార్కింగ్‌ను క్రమబద్ధీకరించేందుకు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, కేసుల నమోదు, అవసరమైన సందర్భాల్లో వాహనాల సీజ్‌తో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

రోడ్డు ఆక్రమణలు, అక్రమ పార్కింగ్‌పై ప్రత్యేక తనిఖీలు, నిఘా నిరంతరం కొనసాగుతుందని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు వ్యాపారులు, వాహనదారులు, ప్రజలు సహకరించాలని తిరుపతి ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Tags: Traffic police take special measures against road encroachments and illegal parking.