భద్రాచలం ముచ్చట్లు:
351 కోట్లతో తొలిదశ దేవాలయ పునరాభివృద్ధి పనులు
-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి ఆలయ పునరాభివృద్ధి భూమిపూజలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక ఆద్యంతం వైభవోపేతంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక వైభవాన్ని చాటిచెప్పేలా, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్నిదక్షిణఅయోధ్యగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా ముందుగా భద్రాచలం దేవాలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ లో భాగంగా రూ. 351 కోట్లతో చేపట్టనున్న తొలిదశ అభివృద్ధి పనులకు, గోదావరి పుష్కర ఘాట్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ భూమిపూజలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , కొండా సురేఖ , వాకిటి శ్రీహరి తో కలిసి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2027లోరానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భద్రాచలం పునరాభివృద్ధి ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. రూ.568 కోట్లతో మూడు దశల్లో అభివృద్ధి పనులు చేస్తుందన్నారు. రెండో దశలో రూ.108 కోట్ల నిధులను వెచ్చిస్తుందని తెలియజేశారు. దక్షిణ అయోధ్యగా, ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా భద్రచలాన్ని తీర్చిదిద్దాలని ప్రజాప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. శ్రీ సీతారామచంద్రులవారి ఆశీస్సులతో ఆలయాభివృద్ధి పనులు సజావుగా జరగాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా విలసిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి , ఎంపీ బలరాం నాయక్ , ఎమ్మెల్యేలు తెల్లం వెంకటేశ్వర రావు , పాయం వెంకటేశ్వర్లు , స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Tags:The celestial wedding ceremony of Sri Sita and Rama in Bhadrachalam was a magnificent affair from start to finish.