September 18, 2026
Explore
బ్రహ్మోత్సవాల వేళ పోలీసుల అప్రమత్తతతో సుమారు ఏడాదిగా కనిపించకుండా పోయిన వ్యక్తి గుర్తింపు

బ్రహ్మోత్సవాల వేళ పోలీసుల అప్రమత్తతతో సుమారు ఏడాదిగా కనిపించకుండా పోయిన వ్యక్తి గుర్తింపు

September 18, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

  • తిరుమలలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని గుర్తించిన క్రైమ్ పోలీసులు.
  • తమిళనాడులో నమోదైన మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్నట్లు నిర్ధారణ.
  • తమిళనాడు పోలీసులతో సమన్వయం చేసి కుటుంబ సభ్యులకు సమాచారం.
  • సురక్షితంగా భార్యకు అప్పగించిన తిరుపతి క్రైమ్ పోలీసులు.

తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాలమేరకు, అదనపు ఎస్పీ (అడ్మిన్) ఆర్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో తిరుపతి, తిరుమలలో పోలీసు సిబ్బంది నిరంతరం నిఘా కొనసాగిస్తూ, అత్యంత అప్రమత్తతతో బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో తిరుమలలో నిఘా విధులు నిర్వహిస్తున్న క్రైమ్ పోలీసు సిబ్బంది అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని గుర్తించి విచారించారు. మరింత సమాచారం కోసం అతడిని తిరుపతి క్రైమ్ పోలీసులకు అప్పగించారు.

తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్ రెడ్డి మరియు సిబ్బంది విచారణలో సదరు వ్యక్తి తమిళనాడుకు చెందినవాడని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2025 నవంబర్‌లో భార్య జవార్ల, పిల్లలకు సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు వెల్లడించాడు. అనంతరం చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నట్లు తెలిపాడు.

మరింత సమాచారం కోసం తమిళనాడు పోలీసు అధికారులను సంప్రదించగా, నీలంకరై పోలీస్ స్టేషన్, అడయార్, తమిళనాడు పరిధిలో Missing Person Case గా నమోదై ఉన్నట్లు నిర్ధారణ అయింది. సంబంధిత కేసు దర్యాప్తులో ఉన్నట్లు తమిళనాడు పోలీసు అధికారులు తెలిపారు.

దీంతో తిరుపతి క్రైమ్ పోలీసులు వెంటనే సంబంధిత తమిళనాడు పోలీసు అధికారులకు, అలాగే అతని భార్య జవార్లకు సమాచారం అందించారు. పోలీసుల అప్రమత్తత, సమన్వయం మరియు సత్వర చర్యలతో సుమారు ఏడాది కాలంగా కనిపించకుండా పోయిన వ్యక్తిని గుర్తించగలిగారు.

17-09-2026న అతని భార్య జవార్ల, సంబంధిత పోలీసు సిబ్బంది తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా, సంబంధిత పోలీసు అధికారుల సూచనల మేరకు సదరు వ్యక్తిని సురక్షితంగా అతని భార్య కి అప్పగించారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల భద్రతతో పాటు అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, తప్పిపోయిన వ్యక్తులు తదితర అంశాలపై పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ నిఘా కొనసాగిస్తున్నారని జిల్లా పోలీసులు తెలిపారు.

Tags: Police alert during Brahmotsavam to identify man who went missing for about a year