September 18, 2026
Explore
నేడే ఆఖరు ముగియనున్న పింఛన్‌ దరఖాస్తు గడువు

నేడే ఆఖరు ముగియనున్న పింఛన్‌ దరఖాస్తు గడువు

September 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగియనుంది. ఇదివరకు ఈనెల 7వ తేదీ నుంచి 16వ తేదీ దాకా ఆన్‌లైన్‌లో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లతోపాటు మిగిలిన అన్ని రకాల కేటగిరీల పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. తొలి రెండు రోజులు సర్వర్‌ పనిచేయకపోవడంతో దరఖాస్తుదారులు అవస్థలు పడ్డారు. ఆ తర్వాత వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారుల సౌకర్యార్థం శుక్రవారం దాకా గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు మరోక్క రోజే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటిదాకా 59,950 మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ సమస్య
కుటుంబంలో ఒక వ్యక్తికి వివాహం జరిగినప్పుడు, వారిని పాత కుటుంబ నుంచి విడదీసి కొత్త కుటుంబంగా మార్చాలి. అలాగే 60 ఏళ్లు పైబడిన వారితోపాటు జీవిత భాగస్వామిని కోల్పోయి ఒంటరిగా ఉన్న వారికి హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌లో ఫ్యామిలీ స్ప్లిట్‌ కుటుంబం నుంచి వేరు చేయాల్సి ఉంది. గత వైసీఏపీ హయాం నుంచి హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌ నమోదును ఆపేశారు. అప్పటి నుంచి కొత్త పింఛన్‌, ఇతర ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారులు దూరమవుతున్నారు. ఆయా కుటుంబాల సభ్యులకు రేషన్‌కార్డులు వేర్వేరుగా జారీ చేసినా.. ఆన్‌లైన్‌లో హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌లో ఒకే కుటుంబంగా చూపిస్తుండటంతో పలు రకాల నిబంధనల మూలంగా పథకాలకు అనర్హులవుతున్నారు. హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌ పెండింగ్‌ ఉండటంతో వందలాది మందికి ప్రస్తుతం కొత్త పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి వారిపై ప్రత్యేక చొరవ తీసుకొని పథకాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలని బాధిత వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

Tags: Deadline for pension applications ends today.