.. మళ్లీ APPSCకే బాధ్యత, పరీక్ష రాయాల్సిందే
అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (వీఏఎస్) ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్ణయం మార్చుకుంది. ముందు ఈ వీఏఎస్ పోస్టుల్ని డిపార్ట్‌మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా రాత పరీక్ష లేకుండా భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
మెరిట్ ఆధారంగా ప్రత్యేక నిబంధనలకు లోబడి అభ్యర్థులకు వర్తించే వెయిటేజ్‌ని అనుసరించాలని భావించింది. ఏపీ ప్రభుత్వం రెండు రోజుల్లోనే మరోసారి నిర్ణయం మార్చుకుంది. ఈ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీని మళ్లీ ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి నియామకాలు చేపట్టనున్నారు. ఈ నెల 13న అకడమిక్ మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాలని జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది.
ఏపీ ప్రభుత్వం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల్ని రాత పరీక్ష లేకుండా నియమించాలని తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వచ్చాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.. ఈ వీఏఎస్‌ల నియామక ప్రక్రియలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం సరికాదని.. నియామకాల్లో అక్రమాలకు ఆస్కారం ఉందని ఆరోపించింది. దీంతో ఏపీ ప్రభుత్వం విమర్శలకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఈ ఉద్యోగాల భర్తీని మళ్లీ ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టుల భర్తీపై స్పష్టత ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 160 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 13న వ్యవసాయశాఖ ఎక్స్‌అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో కీలక అంశాలు ప్రస్తావించారు. అకడమిక్ పనితీరు, ఉన్నత విద్యాభ్యాసం, సర్వీసు అనుభవం, గ్రాడ్యుయేషన్ తర్వాత సీనియారిటీ ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పుడు ఆ ఉత్తర్వుల్ని రద్దు చేసి ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఈ మార్పును గమనించాలని ప్రభుత్వం సూచించింది. అంతేకాదు ఏపీ ప్రభుత్వం గ్రూప్-1తో పాటుగా వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటు పోలీస్‌శాఖలో 2050 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు.
Tags: Change in the recruitment process for Veterinary Assistant Surgeon posts.