అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ హోంశాఖ కీలక నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. మొత్తం 2,050 పోస్టులు పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ఎస్‌పీఎఫ్, పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్, పోలీసు కమ్యూనికేషన్స్, ఫోరెన్సిక్ విభాగాల్లో భర్తీ చేయనుంది.
ఎస్సై, కానిస్టేబుల్, ఫోరెన్సిక్ నిపుణుల పోస్టులు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన పోస్టుల్లో.. అగ్నిమాపకశాఖలో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి దేహదారుఢ్య (ఫిజికల్), రాత పరీక్షలు తప్పనిసరి చేశారు. గతంలో ఈ పోస్టులకు ఫిజికల్ మెజర్‌మెంట్ పరీక్షలు నిర్వహించి.. అర్హత సాధించిన వారికి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేసేవారు.
కొత్త రూల్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా శారీరక కొలతలకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు. అక్కడ అర్హత సాధించిన వారికి పీఈటీ (దేహదారుఢ్య పరీక్షలు)లో భాగంగా పది నిమిషాలు లోపు 1,600 మీటర్ల పరుగు పరీక్ష కూడా ఉంటుంది. రన్నింగ్‌లో అర్హత సాధించిన వారికి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.. డ్రైవింగ్‌లోనూ అర్హత సాధించినవారికి రాతపరీక్ష (3 గంటలు) నిర్వహిస్తారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నిబంధనలు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అగ్నిమాపకశాఖలో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు 147 పోస్టులకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/ ద్వారా అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు, రాతపరీక్ష తేదీలు, ఇతర వివరాలతో త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు రెండేళ్ల పాటు వయోపరిమితి పెంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం వరుసగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఏపీ పోలీస్‌శాఖలో ఉద్యోగాలు మాత్రమే కాదు.. రెండు రోజుల క్రితం గ్రూప్-1తో పాటుగా మరికొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.. దాదాపు 800కుపైగా పోస్టుల్ని భర్తీ చేయనున్నారు.
Tags; Written examinations for Driver-Operator posts in the Fire Department.