మదనపల్లె ముచ్చట్లు:
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ నిబంధనలు పాటించకుండా ప్రజాప్రతినిధులను విస్మరించడంపై తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ములకలచెరువు మండల ఎంపీడీవోకు గురువారం షోకాజ్ నోటీసు జారీ చేశారు.
ములకలచెరువు మండలం వేపూరికోట గ్రామంలో పంచాయతీరాజ్, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) ఆధ్వర్యంలో గురువారం అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అయితే నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యేగా తనకు ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాచారం ఇవ్వకపోవడం, ఆహ్వానించకపోవడంపై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిబంధనలు, ప్రోటోకాల్ ప్రకారం నియోజకవర్గ పరిధిలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేకు అధికారికంగా సమాచారం అందించి ఆహ్వానించాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు. ఈ నిబంధనలను పట్టించుకోకుండా కార్యక్రమం నిర్వహించడం ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులను విస్మరించడం, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల వివరణ ఇవ్వాలని ఎంపీడీవోను ఆదేశించారు.
నోటీసు అందిన 48 గంటల్లోగా లిఖితపూర్వకంగా వివరణ సమర్పించాలని ఎమ్మెల్యే సూచించారు. గడువులోగా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి, ప్రభుత్వానికి తీసుకెళ్లి తదుపరి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Tags: MLA Peddireddy Dwarakanatha Reddy issues show-cause notice to Mulakalacheruvu MPDO.