September 17, 2026
Explore
ఘనంగా విశ్వకర్మ భగవానుని జయంతి వేడుకలు

ఘనంగా విశ్వకర్మ భగవానుని జయంతి వేడుకలు

September 17, 2026 | Andhra Pradesh

చేతివృత్తుల వారు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి: డిఆర్ఓ వెంకటేష్

మదనపల్లి ముచ్చట్లు:

దైవిక వాస్తుశిల్పి విశ్వకర్మను ఆదర్శంగా తీసుకుని చేతివృత్తుల వారు తమ నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్ఓ) వెంకటేష్ సూచించారు.

గురువారం మదనపల్లి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఆర్ఓ వెంకటేష్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ చారి, బీసీ సంక్షేమ అధికారి తేజస్విని తదితరులు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ…. విశ్వకర్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిర్మాణం, శిల్పకళ, చేతివృత్తులు, సాంకేతిక నైపుణ్యాలకు విశ్వకర్మ ప్రతీకగా నిలిచారని చెప్పారు. తరతరాలుగా వస్తున్న కళా నైపుణ్యాన్ని కాపాడుకుంటూ, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని చేతివృత్తుల వారికి సూచించారు.

విశ్వబ్రాహ్మణులు తమ కళా నైపుణ్యంతో సమాజానికి అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ముఖ్యంగా స్వర్ణకారులు ఆధునిక అవసరాలకు అనుగుణంగా వినూత్న ఆభరణాలను రూపొందిస్తూ తమ ప్రతిభను చాటుతున్నారని పేర్కొన్నారు. విశ్వకర్మ భగవానుని ఆశీస్సులతో విశ్వబ్రాహ్మణులు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ చారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. స్వర్ణకారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 50 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్, ప్రత్యేక కాలనీ ఏర్పాటు వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

పది మంది స్వర్ణకారులు ఒక గ్రూపుగా ఏర్పడి క్లస్టర్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా బ్యాంకు రుణాలు, యంత్రాలు అందించే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలో విశ్వబ్రాహ్మణ సంఘానికి స్థలం, విజయవాడలో రెండు ఎకరాల స్థలం కేటాయించి శిక్షణ, ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు.

చేతివృత్తిదారులకు రుణాలు, యంత్రాలు అందించి ఉపాధి అవకాశాలు పెంచేలా జిల్లా వారీగా చర్యలు చేపడుతున్నట్లు రామకృష్ణ చారి తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి తేజస్వి, కలెక్టరేట్ ఏవో, సెక్షన్ సూపరింటెండెంట్లు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసి రామకృష్ణ, భాస్కరాచారి, యుగంధర్, నాగార్జున చారి, సుభద్ర, రత్నమాచారి, రమేష్, విద్యార్థులు, వివిధ చేతివృత్తుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags: Grand celebrations of Lord Vishwakarma Jayanti