September 17, 2026
Explore
ఇన్‌స్టాగ్రామ్‌ వల..రూ.22.80 లక్షలు హాంఫట్‌..!!

ఇన్‌స్టాగ్రామ్‌ వల..రూ.22.80 లక్షలు హాంఫట్‌..!!

September 17, 2026 | Andhra Pradesh


👉..రూ.1.44 కోట్ల లాభం వచ్చిందంటూ బురిడీ..!!
👉..‘ట్యాక్స్‌’ పేరుతో మరో రూ.25 లక్షలకు ఎర..!!
👉..APK ఫైల్‌తో మరో మోసం..ఇద్దరు నిందితుల అరెస్ట్..!!
👉..రూ.25 లక్షల నగదు,4 సెల్‌ఫోన్లు,ల్యాప్‌టాప్‌ స్వాధీనం..!!
👉..మీడియా సమావేశంలో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌..!!

..నంద్యాల ముచ్చట్లు:


..సైబర్‌ నేరగాళ్లు సోషల్‌ మీడియాను అడ్డాగా చేసుకుని ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌ తెలిపారు.స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ ఇన్‌స్టాగ్రామ్‌,వాట్సాప్‌ ద్వారా వల విసిరి ఓ బాధితుడి నుంచి రూ.22.80 లక్షలు కాజేసిన ముఠా గుట్టును పోలీసులు ఛేదించారని చెప్పారు.పెట్టుబడిపై రూ.1.44 కోట్లకు పైగా లాభం వచ్చినట్లు నకిలీ వివరాలు చూపించి,ఆ మొత్తాన్ని తీసుకోవాలంటే ‘ట్యాక్స్‌’గా మరో రూ.25 లక్షలు చెల్లించాలంటూ డిమాండ్‌ చేసినట్లు గురువారం మీడియా సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు..!!

..సంజామల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 34 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి 2024 డిసెంబరు 2న ఇన్‌స్టాగ్రామ్‌లో స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులకు సంబంధించిన ప్రకటన కనిపించింది.దానిని అనుసరించగా నిందితులు అతడిని వాట్సాప్‌ గ్రూపులో చేర్చుకున్నారు.స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు ఆర్జించవచ్చని నమ్మించారు..!!

..తొలుత చిన్న మొత్తాలతో పెట్టుబడులు పెట్టించి,నమ్మకం కలిగించారు.అనంతరం వివిధ బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.బాధితుడి నుంచి మొత్తంగా రూ.22.80 లక్షలు తీసుకున్నారు.ఆ తర్వాత యాప్‌లో అతడి పెట్టుబడికి భారీగా లాభాలు వచ్చినట్లు చూపించారు.ఖాతాలో రూ.1.44 కోట్లకు పైగా ఉన్నట్లు నకిలీ లెక్కలు చూపించి మరింతగా మభ్యపెట్టారు..!!

..యాప్‌లో కనిపిస్తున్న భారీ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలంటే ముందుగా రూ.25 లక్షలు ట్యాక్స్‌ చెల్లించాలంటూ నిందితులు ఒత్తిడి చేశారు.అప్పటికే మోసాన్ని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి,దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు..!!

..మరో కేసులో ఓ 29 ఏళ్ల ఆటో డ్రైవర్‌ను సైబర్‌ నేరగాళ్లు టార్గెట్‌ చేశారు.గుర్తు తెలియని వ్యక్తులు పంపిన APK ఫైల్‌ను ఓపెన్‌ చేయడంతో అతడి మొబైల్‌ ఫోన్‌పై అనధికారిక ప్రాప్యత పొందినట్లు పోలీసులు గుర్తించారు.అనంతరం బ్యాంకు ఖాతాలోని నగదును ఇతర ఖాతాలకు మళ్లించినట్లు ఎస్పీ తెలిపారు..!!

..సైబర్‌ నేరగాళ్లు వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలను సేకరించి వాటిని మోసాలకు వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు.ఖాతాలు,సిమ్‌కార్డులు,ఏటీఎం కార్డుల వివరాలను ఇతరులకు అందిస్తూ సైబర్‌ నేరాలకు సహకరిస్తున్న వారి పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతోందన్నారు..!!

..పెట్టుబడి పేరుతో బాధితులను ఆకర్షించడం..వాట్సాప్‌ గ్రూపుల్లోకి చేర్చడం..యాప్‌లో భారీ లాభాలు వచ్చినట్లు చూపించడం..డబ్బు విత్‌డ్రా చేసుకునే సమయంలో ట్యాక్స్‌,ప్రాసెసింగ్‌ ఫీజు,ఇతర ఛార్జీల పేరుతో మళ్లీ మళ్లీ డబ్బులు వసూలు చేయడం నిందితుల పద్ధతిగా గుర్తించినట్లు తెలిపారు..!!

..కేసుల దర్యాప్తులో భాగంగా కొలుసు శ్రీకాంత్‌ (47) సం “సనపాల సాయి ప్రకాష్‌ నాయుడు అలియాస్‌ ప్రకాష్‌ (29) సం “ను పోలీసులు అరెస్టు చేశారు.వారి నుంచి రూ.25 లక్షల నగదు,నాలుగు మొబైల్‌ ఫోన్లు,ఒక ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.ఈ కేసుల్లో మరికొందరి ప్రమేయంపై కూడా దర్యాప్తు కొనసాగుతోందన్నారు..!!

..“సైబర్‌ మోసానికి గురైన తర్వాత బాధపడటం కంటే..వెంటనే స్పందించడం ముఖ్యం.నగదు పోయిన వెంటనే 1930కు ఫోన్‌ చేస్తే డబ్బును ఫ్రీజ్‌ చేసే అవకాశం ఉంటుంది” అని ఎస్పీ సూచించారు.సోషల్‌ మీడియాలో వచ్చే పెట్టుబడి ప్రకటనలను గుడ్డిగా నమ్మవద్దని,అపరిచితులు పంపే APK ఫైళ్లు,అనుమానాస్పద లింకులను ఓపెన్‌ చేయవద్దని హెచ్చరించారు.OTPలు,పాస్‌వర్డ్‌లు,బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించకూడదన్నారు..!!

..సైబర్‌ నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ స్పష్టం చేశారు.జిల్లాలో ప్రజలకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు.నంద్యాల జిల్లా పోలీసు శాఖ సైబర్‌ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తోందని గతంలోనూ స్థానికంగా వెల్లడించినట్లు తెలిపారు..!!

Tags: Trapped by Instagram… Rs 22.80 lakh lost!