September 17, 2026
Explore
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక చర్యలు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక చర్యలు.

September 17, 2026 | Andhra Pradesh

  • “ట్యాగ్ కట్టుకోండి.. మీ భద్రత మా బాధ్యత” నినాదంతో ప్రత్యేక జియో ట్యాగింగ్ కార్యక్రమం.
  • చిన్నారులు, వృద్ధులు తప్పిపోకుండా ముందస్తు జాగ్రత్తలు – తప్పిపోయిన వెంటనే గుర్తించేలా చర్యలు.
  • నడక మార్గాలు, నాలుగు మాడ వీధులు, గ్యాలరీలు, బస్టాండ్లు, చౌల్ట్రీలు, విశ్రాంతి భవనాల వద్ద ప్రత్యేక నిఘా.
  • CCTV, (డ్రోన్లు తిరుపతి), కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతర పర్యవేక్షణ.

తిరుపతి ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు నేతృత్వంలో భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పటిష్టమైన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు కుటుంబ సభ్యుల నుంచి విడిపోకుండా, తప్పిపోకుండా ప్రత్యేక ముందస్తు చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే నడక మార్గాలు, నాలుగు మాడ వీధులు, గ్యాలరీలు, బస్టాండ్లు, చౌల్ట్రీలు, విశ్రాంతి భవనాలు, ప్రధాన రద్దీ ప్రాంతాల వద్ద పోలీసులు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉంటున్నారు. చిన్నారులు, వృద్ధులకు జియో ట్యాగ్‌లు ఏర్పాటు చేసి, వారు కుటుంబ సభ్యుల నుంచి విడిపోయిన సందర్భంలో త్వరగా గుర్తించి, వారి కుటుంబ సభ్యుల వద్దకు సురక్షితంగా చేర్చేలా చర్యలు చేపడుతున్నారు.

“ట్యాగ్ కట్టుకోండి.. మీ భద్రత మా బాధ్యత” అనే సందేశంతో భక్తులకు అవగాహన కల్పిస్తూ చిన్నారులు, వృద్ధులకు ట్యాగ్‌లు ధరింపజేస్తున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రద్దీ ప్రాంతాల్లో తమ వెంట వచ్చే చిన్నారులు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారిని ఒంటరిగా వదిలివేయకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.

అదేవిధంగా CCTV కెమెరాలు, డ్రోన్లు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థల ద్వారా రద్దీ ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన ప్రాంతాల్లో అదనపు పోలీసు సిబ్బందిని మోహరించారు. భక్తుల రాకపోకలు, రద్దీ, వాహనాల కదలికలు తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా పోలీసు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు.

చిన్నారి లేదా వృద్ధుడు కుటుంబ సభ్యుల నుంచి విడిపోయినట్లయితే భయపడకుండా వెంటనే సమీపంలోని పోలీసు సిబ్బందిని లేదా భద్రతా సిబ్బందిని సంప్రదించాలని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, భక్తులకు సూచించారు.

Tags:Special measures for the safety of children and the elderly during the Tirumala Srivari Brahmotsavams.