జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు
ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు విజయవంతం చేయాలి
అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లె ముచ్చట్లు:
స్వచ్ఛతే సేవ!…పరిశుభ్రమైన జిల్లా మనందరి లక్ష్యం కావాలి. జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు నిర్వహించనున్న స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
బుధవారం మదనపల్లె కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి అధికారులు సమన్వయంతో ముందస్తు ప్రణాళిక రూపొందించి, ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని సూచించారు.
స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలతో పాటు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఐదు ప్రధాన అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు
- పరిశుభ్రత లక్ష్య ప్రాంతాల రూపాంతరం (CTUs): చెత్త పేరుకుపోయిన ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రమైన ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి.
- స్వచ్ఛ పాఠశాల: పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుధ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి.
- సఫాయి మిత్ర సురక్ష: పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.
- స్వచ్ఛత కోసం ప్రజల భాగస్వామ్యం: ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, వివిధ సంఘాలను భాగస్వామ్యం చేసి స్వచ్ఛత కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలి.
- స్వచ్ఛతా సే సమృద్ధి – వ్యర్థాల నుంచి సంపద: వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించడం, వాటి ద్వారా ఆర్థిక విలువను సృష్టించడం, వ్యర్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలి.
సెప్టెంబర్ 17న ప్రజల భాగస్వామ్యంతో ప్రారంభం
ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 17 నుంచి నెల రోజుల పాటు వివిధ స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహించాలని, కార్యక్రమాల అమలును అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వచ్ఛతే సేవ.. పరిశుభ్రమైన జిల్లా మనందరి బాధ్యత అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, ఈ సందర్భంగా 17న ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని, దీపం వెలిగించి స్వచ్ఛత కోసం సంకల్పం తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో మదనపల్లె, బి కొత్తకోట, పుంగనూరు మున్సిపల్ కమిషనర్లు ప్రమీల, రమాదేవి మధుసూదన్ రెడ్డి, డిపిఓ రాధమ్మ, మున్సిపల్, పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags: Cleanliness is Service!… A clean district is our collective goal.