- పోగొట్టుకున్న పర్సును గుర్తించి భక్తురాలికి సురక్షితంగా అప్పగించిన పోలీసులు.
- బ్రహ్మోత్సవాల వేళ భక్తుల భద్రతతో పాటు పోగొట్టుకున్న వస్తువుల రికవరీపై ప్రత్యేక దృష్టి.
- పిల్లలు, వృద్ధులు, విలువైన వస్తువుల విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలి.
- అత్యవసర సమయంలో డయల్-112 ద్వారా తక్షణ పోలీసు సహాయం పొందవచ్చు.
తిరుపతిముచ్చట్లు:
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇందులో భాగంగా భక్తుల భద్రతతో పాటు వారు పోగొట్టుకున్న వస్తువులను గుర్తించి తిరిగి అందజేసేలా తిరుమల క్రైమ్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పైడాయవలస గ్రామానికి చెందిన ఎడ్ల అప్పమ్మ (48) తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన సందర్భంగా తన పర్సును పోగొట్టుకున్నారు. పర్సు పోయిన విషయాన్ని గుర్తించిన ఆమె తిరుమల క్రైమ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించి, పర్సులో ఉన్న నగదు, ఇతర వస్తువుల వివరాలను పోలీసులకు తెలియజేశారు.
కమాండ్ కంట్రోల్‌లోని డీఎస్పీ, సీఐ మరియు సిబ్బంది ఆమె తెలిపిన వివరాలను పరిశీలించి, పర్సులోని నగదు, వస్తువులను సరిచూసి, పర్సు అప్పమ్మదేనని నిర్ధారించిన అనంతరం ఆమెకు సురక్షితంగా అప్పగించారు.
పోగొట్టుకున్న పర్సును తిరిగి అందజేసినందుకు అప్పమ్మ తిరుమల క్రైమ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల చర్యలను అభినందిస్తూ, శ్రీవారి దర్శనానికి వచ్చిన తనకు ఇది స్వామివారి అనుగ్రహంగా భావిస్తున్నానని తెలిపారు.
భక్తులకు పోలీసుల సూచనలు
తిరుమలకు వచ్చే భక్తులు తమ వెంట తీసుకువచ్చే నగదు, మొబైల్ ఫోన్లు, ఆభరణాలు, పర్సులు తదితర విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. రద్దీ ప్రాంతాల్లో పిల్లలను తమతోనే ఉంచుకోవాలి. పిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లల వద్ద తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు ఉండేలా చూడాలి.
ఎవరైనా భక్తులు తమ వస్తువులను పోగొట్టుకున్నా, ఎవరైనా తప్పిపోయినా లేదా అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలు కనిపించినా వెంటనే సమీపంలోని పోలీసు సిబ్బందిని సంప్రదించాలి. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడి నుంచైనా డయల్-112 కు కాల్ చేసి పోలీసు సహాయం పొందవచ్చు. అత్యవసరం కాని ఫిర్యాదులు లేదా ఇతర సమస్యల కోసం సమీపంలోని పోలీస్ సిబ్బంది/పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు.
భక్తులందరూ పోలీసుల సూచనలు పాటిస్తూ, పిల్లలు మరియు వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరుచుకుని శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసారు.
Tags:Tirumala Crime Police handed over a lost purse to a female devotee.