కిడ్నాప్ చేసి హత్య అనంతరం సాక్ష్యాలు తారుమారు చేసిన కేసులో
- సాక్ష్యాలు తారుమారు చేసినందుకు A2, A3లకు 7 సంవత్సరాల జైలు శిక్ష.
- ఇద్దరికీ రూ.5,000 చొప్పున జరిమానా విధించిన గూడూరు VII అదనపు జిల్లా కోర్టు.
- సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరచి కేసు విచారణను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లిన పోలీసు అధికారులు.
- ప్రాసిక్యూషన్ సమర్థవంతమైన వాదనలతో ముద్దాయిలకు శిక్ష పడేలా కృషి.
తిరుపతి ముచ్చట్లు:
గూడూరు గౌరవనీయ VII అదనపు జిల్లా న్యాయస్థానం బాలాయపల్లి పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన కిడ్నాప్, హత్య అనంతరం సాక్ష్యాలను తారుమారు చేసిన కేసులో తీర్పు వెలువరించింది. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసిన నేరానికి A2 కొమ్మల మత్తయ్య, A3 పరిచెర్ల బాబ్జాన్ బాబ్జి లకు భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 201 కింద 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 చొప్పున జరిమానా విధించింది.
కేసు వివరాల ప్రకారం.. బాలాయపల్లి మండలం హస్తకావేరి గ్రామానికి చెందిన బావానాసి జయచంద్రకు అదే గ్రామానికి చెందిన కొమ్మల వెంకటయ్య మరియు అతని కుటుంబ సభ్యులతో తరచూ వివాదాలు ఉండేవి. ఈ నేపథ్యంలో కొమ్మల వెంకటయ్య తన బంధువులు, ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో కలిసి మొత్తం 10 మంది సహాయంతో జయచంద్రను కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేసి, మృతదేహాన్ని మేల్చూరు సమీపంలోని జామాయిల్ తోటలో పడవేసి సాక్ష్యాలను తారుమారు చేసినట్లు కేసు దర్యాప్తులో వెల్లడైంది.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆధ్వర్యంలో, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో కేసు విచారణను సమర్థవంతంగా కొనసాగించారు. వెంకటగిరి సీఐ ఎం. రోసయ్య సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరచడంతో పాటు కేసు విచారణను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. వసంత్ కుమార్ సమర్థవంతంగా వాదనలు వినిపించి, ముద్దాయిలకు శిక్ష పడేలా కృషి చేశారు. కేసు విచారణలో బాలాయపల్లి ఎస్‌ఐ డి. సురేష్ బాబు, కోర్ట్ లైజన్ డి. మల్లికార్జున రావు, కోర్ట్ కానిస్టేబుల్ కె. రామకృష్ణలు సహకరించారు.
- శిక్ష పడిన ముద్దాయిలు.
A2. కొమ్మల మత్తయ్య, తండ్రి: వెంకటయ్య, వయస్సు: 30 సంవత్సరాలు, హస్తకావేరి గ్రామం, బాలాయపల్లి మండలం.
A3. పరిచెర్ల బాబ్జాన్ బాబ్జి, తండ్రి: సీనయ్య, వయస్సు: 21 సంవత్సరాలు, హస్తకావేరి గ్రామం, బాలాయపల్లి మండలం; స్వస్థలం: వాములమిట్ట, గూడూరు పట్టణం.
Tags:Seven years of rigorous imprisonment for two accused.