September 15, 2026
Explore
హీరో అల్లు అర్జున్ మామపై గచ్చిబౌలిలో కేసు నమోదు

హీరో అల్లు అర్జున్ మామపై గచ్చిబౌలిలో కేసు నమోదు

September 15, 2026 | Uncategorized

హైదరాబాద్‌ ముచ్చట్లు:

నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై కేసు

నానక్‌రామ్‌గూడ భూ వివాదంపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు

గేట్ల తాళాలు పగలగొట్టి చొరబడ్డారని ఆరోపణ

సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులకు సాక్ష్యంగా అందజేత

ఉద్యోగులు, నివాసితులకు రక్షణ కల్పించాలని వినతి

ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నగరంలోని ఐటీ కారిడార్‌ పరిధిలోని నానక్‌రామ్‌గూడలో గల ఒక భూవివాదానికి సంబంధించి ఆయనపై క్రిమినల్ ఫిర్యాదు దాఖలైంది.

నానక్‌రామ్‌గూడలోని ‘మంత్రి కాస్మోస్’ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్ రెడ్డి మరికొందరితో కలిసి తమ భవన ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించారని వారు ఆరోపించారు. గేట్ల తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడటమే కాకుండా, అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, ఫొటోలను ఒక పెన్ డ్రైవ్‌లో నిక్షిప్తం చేసి, గచ్చిబౌలి పోలీసులకు సాక్ష్యంగా అందజేశారు. చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు.

అంతేకాకుండా, ఈ ఫిర్యాదు ప్రతులను తెలంగాణ డీజీపీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మాదాపూర్ డీసీపీ, గచ్చిబౌలి ఏసీపీలకు సైతం పంపారు. ఐటీ కారిడార్‌లోని తమ ఉద్యోగులకు, నివాసితులకు రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags: Case registered against actor Allu Arjun’s father-in-law in Gachibowli.