September 13, 2026
Explore
మట్టి గణపతితో పర్యావరణ పరిరక్షణకు స్కౌట్స్‌–గైడ్స్‌ పిలుపు

మట్టి గణపతితో పర్యావరణ పరిరక్షణకు స్కౌట్స్‌–గైడ్స్‌ పిలుపు

September 13, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

  • కాలుష్య రహిత వినాయక చవితికి స్కౌట్స్‌–గైడ్స్‌ శ్రీకారం,
  • అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పర్యావరణ హిత వినాయక చవితిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు,
  • జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి వెల్లడి

“మట్టి గణపతి – పర్యావరణానికి రక్షణ” అనే సందేశంతో ది భారత్ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ అన్నమయ్య జిల్లా సంఘం ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో పర్యావరణ హిత వినాయక చవితి కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి తెలిపారు.

ఆదివారం ఉదయం డైట్‌లోని స్కౌట్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కార్యాలయం జారీ చేసిన ఆదేశాల మేరకు శుక్ర, శనివారాల్లో జిల్లా వ్యాప్తంగా స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు, యూనిట్ లీడర్ల ఆధ్వర్యంలో స్కౌట్స్‌, గైడ్స్‌ విద్యార్థులు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మట్టి గణేష్‌ విగ్రహాల తయారీ, అవగాహన ర్యాలీలు, పోస్టర్‌–డ్రాయింగ్‌ పోటీలు, నినాదాల రచన, ఇంటింటా ప్రచారం వంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్‌, థర్మాకోల్‌, రసాయన రంగుల వినియోగాన్ని నివారించి, సహజ మట్టి విగ్రహాలు, సహజ రంగులను ప్రోత్సహించాలని విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.

అలాగే చెరువులు, కుంటలు, కాలువలు తదితర నీటి వనరులు కలుషితం కాకుండా పర్యావరణహిత నిమజ్జన పద్ధతులను పాటించాలని ప్రజలకు సూచించినట్లు చెప్పారు. “ప్లాస్టిక్ రహిత వినాయక చవితి – పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరి బాధ్యత” అనే సందేశాన్ని విద్యార్థులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించేలా కార్యక్రమాలను నిర్వహించిన స్కౌట్స్‌, గైడ్స్‌, స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు, యూనిట్ లీడర్లను జిల్లా చీఫ్ కమిషనర్, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె. సుబ్రమణ్యం ఈ సందర్భంగా అభినందించినట్లు ఆయన తెలిపారు.

Tags: Scouts and Guides call for environmental protection using clay Ganesha idols.