September 13, 2026
Explore
జావా సముద్రంలో 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక గల్లంతు..!!

జావా సముద్రంలో 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక గల్లంతు..!!

September 13, 2026 | Andhra Pradesh

జకార్తా ముచ్చట్లు:

ఇండోనేషియాలోని జావా సముద్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక గల్లంతైంది. నౌకలో 240 మందికి పైగా ఉండటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. సురబయ నుంచి బంజర్‌మసిన్‌కు వెళ్తుండగా నౌకతో రాడార్, రేడియో సంబంధాలు ఒక్కసారిగా తెగిపోయాయి. నౌక ఏమైందనే విషయం అంతుచిక్కడం లేదు. చివరిసారిగా బంజర్‌మసిన్‌లోని ఓ రేవుకు సుమారు 92 మైళ్ల దూరంలో జావా సముద్ర జలాల్లో నౌక ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

అయితే, సముద్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో భారీ అలలు ఎగసిపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే నౌకతో సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం. భారీ అలల తాకిడికి నౌక ప్రమాదానికి గురై ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే, నౌక గల్లంతుకు కచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. మరోవైపు, సమాచారం అందుకున్న వెంటనే ఇండోనేషియా సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. జావా సముద్ర జలాల్లో నేవీకి చెందిన బోట్లు, హెలికాప్టర్లను మోహరించి నౌక కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ప్రతికూల వాతావరణం, సముద్రంలో భారీ అలల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఎదురవుతోంది.

కాగా, నౌకలో ఉన్న ప్రయాణికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ వారి ఆచూకీ కోసం అధికారుల నుంచి సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ప్రాణనష్టం జరిగినట్లు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. నౌకను గుర్తించి, అందులో ఉన్న ప్రయాణికుల పరిస్థితిని నిర్ధారించడమే ప్రస్తుతం సహాయక బృందాల ప్రధాన లక్ష్యంగా మారింది. నౌక ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను యుద్ధప్రాతిపదికన కొనసాగించనున్నట్లు ఇండోనేషియా అధికారులు తెలిపారు.

Tags: Ship carrying 240 passengers goes missing in the Java Sea…!!