. అధికారుల నిర్లక్ష్యానికి బలైన లక్ష్మీనరసింహస్వామి ఆలయం
కొమరవెల్లిపాడు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి వర్షపు నీరు
గర్భగుడిలోకి చేరుతున్న నీరు.. పట్టించుకోని ఆలయ అధికారులు
చిలకలూరిపేట ముచ్చట్లు:
కొమరవెల్లిపాడులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వర్షపు నీరు గర్భగుడిలోకి చేరుతున్నా సంబంధిత ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడిన ప్రతిసారీ ఆలయ ప్రాంగణంలో నీరు నిలిచి, చివరకు గర్భగుడిలోకి చేరుతున్న పరిస్థితి నెలకొంది.
ప్రతిరోజూ భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకునే పవిత్ర ఆలయంలో కనీస వసతులు కూడా లేకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉదయం జరగాల్సిన దీపారాధనకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆలయ నిర్వహణ తీరుపై భక్తులు ప్రశ్నిస్తున్నారు.
గర్భగుడిలోకి వర్షపు నీరు చేరుతున్న విషయం తెలిసినా ఆలయ అధికారులు, ఈవో స్థాయి అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం ఏమిటని భక్తులు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆలయంలోకి వర్షపు నీరు చేరకుండా శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, ఆలయ పరిశుభ్రత మరియు నిత్య పూజా కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Tags:When it rains, the temple gets inundated.