ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగానికి విప్లవాత్మక అడుగు:
అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారోగ్య రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) కింద రూ.249.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 10 క్రిటికల్ కేర్ బ్లాక్స్ (CCBs) మరియు 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీస్ (IPHLs) ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది.
విజయవాడలోని పాత ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (Old GGH) వద్ద జరిగే ప్రధాన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రత్యక్షంగా పాల్గొని ఈ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ వేదిక నుంచే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సిద్ధంగా ఉన్న మిగిలిన 9 క్రిటికల్ కేర్ బ్లాక్స్ మరియు 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీలను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితర ముఖ్య నేతలు పాల్గొననున్నారు.
అత్యవసర వైద్యానికి క్రిటికల్ కేర్ బ్లాక్స్ (CCBs)
పాండెమిక్‌లు, అంటువ్యాధులు, ఇతర అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో రోగులకు సత్వర మరియు అధునాతన అత్యవసర వైద్య సేవలను అందించడమే ఈ కేర్ బ్లాక్స్ ప్రధాన లక్ష్యం.
- మొత్తం వ్యయం: 10 క్రిటికల్ కేర్ బ్లాక్స్ కోసం రూ. 233.25 కోట్లు కేటాయించారు.
- ప్రారంభమవుతున్న కేంద్రాలు: వైఎస్సార్ కడప GMC (రూ. 23.75 కోట్లు), நெల్లూరు ACSR GMC (రూ. 23.75 కోట్లు), శ్రీకాకుళం GMC (రూ. 23.75 కోట్లు), విశాఖపట్నం AMC (రూ. 23.75 కోట్లు), ప్రకాశం జిఎంసి ఒంగోలు (రూ. 23.75 కోట్లు), అనకాపల్లి జిల్లా ఆసుపత్రి (రూ. 22.25 కోట్లు), తూర్పుగోదావరి GMC రాజమహేంద్రవరం (రూ. 23.75 కోట్లు), కర్నూలు KMC (రూ. 23.75 కోట్లు), శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ ఆసుపత్రి (రూ. 22.25 కోట్లు), ఎన్టీఆర్ జిల్లా SMC విజయవాడ (రూ. 23.75 కోట్లు).
రోగ నిర్ధారణ బలోపేతానికి ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీలు (IPHLs)
వ్యాధుల సర్వేలెన్స్ పెంచడం, ముందస్తు వ్యాధి నిర్ధారణ మరియు ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులలో వేగవంతమైన ప్రతిస్పందన కోసమే ఈ నియోజకవర్గ/జిల్లా స్థాయి ల్యాబ్‌లను ప్రతిపాదించారు. - మొత్తం వ్యయం: ఒక్కో ల్యాబ్‌కు రూ. 1.25 కోట్ల చొప్పున 12 ల్యాబ్‌లకు మొత్తం రూ. 16.25 కోట్లు వ్యయం చేశారు.
- ల్యాబ్‌లు ప్రారంభమయ్యే ప్రాంతాలు: పార్వతీపురం మన్యం (సీతాంపేట), అనంతపురం (గుంతకల్), చిత్తూరు (పలమనేరు), విశాఖపట్నం (అగనంపూడి), ఎన్టీఆర్ (నందిగామ), బాపట్ల (చీరాల), అల్లూరి సీతారామరాజు (అరకు), పల్నాడు (నరసరావుపేట), నంద్యాల (బనగానపల్లె), తూర్పుగోదావరి (అనపర్తి), కాకినాడ (తుని), మరియు నెల్లూరు (గూడూరు) ఏరియా ఆసుపత్రులలో ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి.
ఈ ప్రాజెక్టుల ప్రారంభంతో రాష్ట్రంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంత ప్రజలకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ, ఎమర్జెన్సీ మరియు నిర్ధారణ సేవలు చేరువకానున్నాయి.
Tags: Inauguration of health projects worth Rs 249.50 crore