అమరావతిముచ్చట్లు:
బ్యాంకు ఉద్యోగుల సమ్మె,రెండో శనివారం, వినాయక చవితి, ఆదివారం సెలవులు.. పలుచోట్ల పనిచేయని ఏటీఎంలు
వరుసగా నాలుగు రోజులపాటు బ్యాంకులకు సెలవులు రావడంతో నగదు అవసరమైన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం సెకండ్ సాటర్డే కావడంతో బ్యాంకులకు సెలవు కాగా, ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయకపోవడం, మధ్యలో వినాయక చవితి పండుగ రావడంతో నగదు లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అత్యవసరంగా నగదు అవసరమైన ప్రజలు ఏటీఎంలను ఆశ్రయిస్తున్నారు.
పండుగ సందర్భంగా పూలు, పూజా సామగ్రి, వినాయక విగ్రహాలు, నిత్యావసర సరుకులు, ఇతర వస్తువుల కొనుగోళ్లకు ప్రజలకు నగదు అవసరం పెరిగింది. అయితే పట్టణంలోని కొన్ని ఏటీఎంలలో నగదు అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు ఒక ఏటీఎం నుంచి మరో ఏటీఎంకు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని చోట్ల ఏటీఎంలు పనిచేయకపోవడం, నగదు అయిపోవడంతో ప్రజలు నిరాశకు గురవుతున్నారు.
సాధారణ రోజుల్లో డిజిటల్ చెల్లింపులు చేస్తున్నప్పటికీ చిన్న వ్యాపారాలు, పండుగ సందర్భంగా కొనుగోళ్లు చేసే కొందరు వినియోగదారులకు నగదు తప్పనిసరి అవుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చే ప్రజలు నగదు కోసం ఏటీఎంలపై ఆధారపడుతున్నారు. బ్యాంకులు వరుస సెలవుల్లో ఉండటంతో ఏటీఎంలలో నగదు నింపే ప్రక్రియపై కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏటీఎంలలో ముందస్తుగా తగినంత నగదు నిల్వ చేయాలని, సెలవుల సమయంలో కూడా ఏటీఎంలు నిరంతరం పనిచేసేలా బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పండుగ సమయంలో నగదు అవసరం ఎక్కువగా ఉండే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు ముందుగానే ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉంచితే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని వారు పేర్కొంటున్నారు.
Tags: Banks closed due to consecutive holidays; people face hardship for cash.