హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రియుడి మోసంపై ముదివేడు పోలీసులు కేసు నమోదు చేయలేదని మనస్తాపం చెందిన ఓ యువతి పోలీస్ అవుట్‌పోస్టులోనే పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన సోమవారం కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. హైదరాబాద్ రామ్‌నగర్‌కు చెందిన జి.ప్రశాంతి(29) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిజేస్తోంది. ఆమెకు నాలుగేళ్ల కిందట కురబలకోట మండలం తెట్టు పంచాయతీ శ్రీరాములవారిపల్లెకు చెందిన నరేష్ మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమయ్యాడు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. నరేష్ డైలీ సీరియల్స్‌లో నటించేవాడు. తరచూ హైదరాబాద్‌కు వెళ్లి వచ్చే క్రమంలో ప్రశాంతికి బాగా దగ్గరయ్యాడు. పైగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో కలసి తిరిగాడు. దాంతో నమ్మకం కలిగి అతడు అడిగిన వెంటనే ఫైనాన్స్‌లో కారు కూడా కొనిచ్చింది. కారు సహా కుటుంబ అవసరాల నిమిత్తం ఇతర ఖర్చులతో కలిపి మొత్తం రూ.40 లక్షల వరకు ఖర్చు పెట్టింది.
ఏడాది కిందట అతడు ప్రేమపెళ్లికి నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి దూరంగా ఉంటున్నారు. ప్రియుడి మోసంపై ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు పట్టించుకుని న్యాయం చేయకపోవడంతో ఏడాదిగా ప్రశాంతి, ఆమె తల్లి రాణి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. కనీసం అతన్ని స్టేషన్‌కు పిలిపించి విచారించే పని కూడా చేయలేదు. రేపుమాపు అంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చారు. కుమార్తెకు న్యాయం జరగకపోవడంతో రాణి కొన్ని రోజులుగా అంగళ్లులో పీజీ హాస్టల్‌లో ఉంటుూ పోలీసులను బతిమాలుతోంది. వారు స్పందించకపోవడంతో తల్లికుమార్తె సోమవారం అంగళ్లులోని పోలీస్ అవుట్‌పోస్టుకు వెళ్లారు.
అక్కడ సిబ్బంది వారిని పట్టించుకోకపోవడంతో వెంట తెచ్చుకున్న పురుగుల మందుతాగి ప్రశాంతి ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు హుటాహుటిన బాధితురాలిని 108 వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. నరేష్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే వరకూ ట్రీట్‌మెంట్ తీసుకోనంటూ వైద్య సిబ్బందిపై తిరగబడింది. ఆసుపత్రిలో అరగంట పాటు తల్లికుమార్తె ఏడుస్తూ జరిగిన మోసాన్ని వివరించారు. అతనిపై తక్షణమే చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని ముదివేడు పోలీసులు హామీ ఇవ్వడంతో ట్రీట్‌మెంట్ తీసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Tags; Hyderabad woman attempts suicide after police fail to register a case.