September 8, 2026
Explore
మాసాంతర నేర సమీక్షా సమావేశం

మాసాంతర నేర సమీక్షా సమావేశం

September 8, 2026 | Andhra Pradesh

విజయనగరం ముచ్చట్లు:

||న్యాయస్థానాల్లో నిందితులు శిక్షింపబడేందుకు సాక్ష్యాధారాల సేకరణే ప్రధానం||
– విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,

జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో సెప్టెంబరు 8న నిర్వహించారు. వివిధ పోలీసు స్టేషనుల్లో నమోదై, దర్యాప్తులో ఉన్న వివిధ కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, దర్యాప్తు పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై దర్యాప్తు అధికారులకు దిశా నిర్దేశం చేసారు.

జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, మాట్లాడుతూ …

▫️నిందితులు శిక్షింపబడే విధంగా కేసుల దర్యాప్తులో సాక్షులను, సాక్ష్యాధారాలను సేకరించాలని, న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసే ముందు అప్పటి వరకు పూర్తి చేసిన కేసు దర్యాప్తును ఒకసారి పునః సమీక్షించుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

▫️వివిధ కేసుల దర్యాప్తులో భాగంగా సీజ్ చేసిన క్రైం ప్రాపర్టీని పోలీసు స్టేషనులో సురక్షితంగా ఒక క్రమపద్ధతిలో భద్రపర్చుకోవాలని, విచారణ సమయంలో వాటిని తిరిగి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలన్నారు.

▫️నిందితుల విచారణ, అరెస్టు సమయంలో వారు తెలిపే వివరాలు సరైనవా? కావా? అన్నది ముందుగా అధికారులు నిర్ధారణ చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఇలా చేయడం వలన ఆయా కేసుల్లో భవిష్యత్తు అవసరాలకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

▫️వాహన తనిఖీలు చేపట్టే సమయంలో నంబరు ప్లేట్స్ లేని వాహనాలు, నంబరు ప్లేట్స్ సక్రంగా లేని వాహనాలు, అనధికార బోర్డులు కలిగిన వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, అటువంటి వాహనాలను సీజ్ చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

▫️నేరాలు, దొంగతనాలు జరిగేందుకు ఎక్కువగా అవకాశం ఉన్న బస్టాండులు, రైల్వే స్టేషన్లు, ఎటిఎం కేంద్రాలు, సెల్ టవర్స్ వద్ద సిసి కెమెరాలను పెట్టే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు. ఇందుకు ప్రజలు, షాపుల యజమానుల సహకారంను తీసుకోవాలన్నారు.

▫️పోలీసు స్టేషనుకు వచ్చే బాధితుల ఫిర్యాదుల పై పోలీసు అధికారులు సానుకూలంగా స్పందించాలని, తక్షణమే న్యాయం చేసేందుకు పారదర్శకంగా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

▫️స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపధ్యంలో గ్రామ స్థాయిలో సమస్యలు సృష్టించే వ్యక్తులను పార్టీలకు అతీతంగా గుర్తించి, వారిని ఎం.ఈ.ఎం.కోర్టుల్లో బైండోవరు చేయాలని, మంచి ప్రవర్తన కొరకు వారి నుండి పూచీకత్తుగా బాండులను తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

▫️గంజాయి వినియోగం, రవాణ, విక్రయాలు తగ్గాయన్న నిర్లక్ష్యం వద్దని, యధావిధిగా గంజాయి నియంత్రణకు చర్యలు చేపట్టాలని, గంజాయి కేసుల్లో గతంలో అరెస్టుకాబడిన నిందితులపై నిఘా పెట్టాలన్నారు.

▫️ఈ నెల 12న నిర్వహించే లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు డిస్పోజ్ అయ్యే విధంగా పోలీసు అధికారులు ప్రణాళిక బద్ధంగా పని చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

▫️వివిధ న్యాయ స్థానాలు జారీ చేసిన ఎన్.బి.డబ్ల్యు.లు, వివిధ పోలీసు స్టేషన్లులో పెండింగులో ఉన్న వారంట్ల మధ్య వ్యత్యాసాన్ని సరిదిద్దాలని, వాటిని ఎగ్జిక్యూట్ చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

▫️దొంగతనాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, జైలు నుండి విడుదలైన నేరస్థుల పైన, పోలీసు స్టేషను పరిధిలో నివసిస్తున్న పాత నేరస్థుల పైన నిఘా పెట్టాలని, రాత్రి గస్తీ, బీట్లును అమలు చేయాలని, నేరం జరిగినపుడు, దొంగతనం కేసుల్లో నిందితులను అరెస్టు చేయు సమయంలో ఇతర పోలీసు స్టేషను అధికారులతో సమాచారాన్ని ఇచ్చి, పుచ్చుకోవాలని, సమన్వయంతో పని చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

▫️వివిధ పోలీసు స్టేషన్లులో నమోదై, దర్యాప్తులో ఉన్న లాంగ్ పెండింగు కేసులను, ఎస్సీ, ఎస్టీ కేసులు, పోక్సో కేసులు, ఎన్డీపిఎస్, మిస్సింగు, మహిళలపై జరుగుతున్న దాడుల కేసులను, గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎన్ఫోర్సుమెంటు కేసులను జిల్లా ఎస్పీ సమీక్షంచి, ఆయా కేసుల దర్యాప్తు పెండింగులో ఉండుటకుగల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని, దర్యాప్తు పూర్తి చేయుటకు అధికారులకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, దిశా నిర్దేశం చేసారు.

▫️ఈ నేర సమీక్ష సమావేశంలో అడ్మిన్ ఎస్పీ పి.సౌమ్యలత, బొబ్బిలి డిఎస్పీ ఆర్.గోవిందరావు, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, మహిళా పిఎస్ డిఎస్పీ పి.వి.వి. నర్సింహారావు, ఎస్సీ అండ్ ఎస్టీ సెల్ డిఎస్పీ ఎం.వీర కుమార్, న్యాయ సలహాదారులు వై.పరశురాం, పలువురు సిఐలు, వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:At the monthly crime review meeting