అమరావతిముచ్చట్లు:
రాష్ట్రంలో 13 నుంచి 28కి పెరిగిన జిల్లా పరిషత్‌లు
కొత్త జడ్పీల పరిధిలోకి 660 మండల పరిషత్‌లు
అదనంగా 15 సీఈఓ, 15 డిప్యూటీ సీఈఓ పోస్టుల ఏర్పాటు
సెప్టెంబర్ 24 తర్వాత అమల్లోకి రానున్న పునర్వ్యవస్థీకరణ
రాష్ట్రంలో జిల్లా ప్రజాపరిషత్‌ల (జడ్పీపీ) పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న 13 జడ్పీల స్థానంలో కొత్తగా 28 జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రెండు వేర్వేరు జీవోలను విడుదల చేసింది.
కొత్తగా ఏర్పాటయ్యే ఈ 28 జడ్పీల పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 660 మండల ప్రజాపరిషత్‌లు (ఎంపీపీ) ఉంటాయి. వీటి కార్యకలాపాల నిర్వహణ కోసం ప్రభుత్వం అదనంగా 15 సీఈఓ, 15 డిప్యూటీ సీఈఓ పోస్టులను సృష్టించింది. మిగిలిన మినిస్టీరియల్, సహాయక సిబ్బందిని ప్రస్తుతం ఉన్నవారి నుంచే హేతుబద్ధీకరించి కొత్త జడ్పీలకు కేటాయించనున్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న 13 జిల్లా పరిషత్‌ల పదవీకాలం ఈ నెల సెప్టెంబరు 24వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత కొత్త జిల్లాల భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ అమల్లోకి వస్తుంది. ప్రతి జిల్లాకు ఒక జడ్పీ చొప్పున పనిచేస్తుంది. భవిష్యత్తులో ఏదైనా మండల పరిషత్ పునర్వ్యవస్థీకరణకు గురైతే, అందుకు అనుగుణంగా జడ్పీ పరిధిలోనూ మార్పులు జరుగుతాయని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
Tags: 28 Zilla Parishads in AP: Government orders issued for reorganization.