ఐ4సీ తరహాలో స్టేట్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ సిద్ధం చేస్తున్న పోలీసు శాఖ….
259 మందితో టీం.. ఐజీ స్థాయి అధికారి నేతృత్వం…
అమరావతిముచ్చట్లు:
సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా స్టేట్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఎస్4సీ)ను రాష్ట్ర పోలీసు శాఖ ఏర్పాటు చేస్తోంది. ఈ విభాగానికి ‘సైబర్ గార్డ్’ అని పేరు పెట్టారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) తరహాలో దీన్ని తీర్చిదిద్దుతున్నారు. విజయవాడ-గుంటూరు మార్గంలో కాజ టోల్ ప్లాజా సమీపంలోని ప్రభల టెక్పార్క్ రూ.10.77 కోట్లతో దీన్ని నెలకొల్పుతున్నారు. 259 మందితో పనిచేయనున్న ఈ విభాగానికి ఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు.
సైబర్ నేరాల దర్యాప్తు, డిజిటల్ ఫోరెన్సిక్, సైబర్ ఇంటెలిజెన్స్, సైబర్ దాడుల ముప్పు పర్యవేక్షణ, వివిధ శాఖలతో కలిసి సమన్వయంతో కూడిన ప్రతిస్పందన సహా పలు కీలక విధులను ‘సైబర్ గార్డ్’ నిర్వహించనుంది. ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు పరికరాలు, డిజిటల్ ఫోరెన్సిక్ టూల్స్, సైబర్ ఇంటెలిజన్స్ ప్లాట్ఫాంలు, సాఫ్ట్వేర్లను సమకూరుస్తున్నారు. పోలీసు అధికారులు, సిబ్బందే కాకుండా సాంకేతిక నిపుణులు, సైబర్ ఎనలిస్ట్లు, డిజిటల్ ఫోరెన్సిక్ సిబ్బంది, బ్యాంక్, టెలికాం సంస్థల
తరఫున వాటి సమన్వయకర్తలు, 24 గంటలూ పనిచేసే టోల్ ఫ్రీ నంబర్ 1930కు వచ్చే కాల్స్ను విశ్లేషించే సిబ్బంది.. ఇలా వివిధ విభాగాల సమాహారంగా సైబర్ గార్డ్ పనిచేయనుంది. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ కేంద్రం ప్రత్యేకతలివీ..
ట్రాకింగ్.. డేటా వెలికితీత
ఐపీ చిరునామాలు, బ్యాంక్ ఖాతాలు, టవర్ లొకేషన్లను ట్రాకింగ్ చేస్తారు. ఇతర మార్గాల ద్వారా నేరగాళ్ల ఉనికి, అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్థావరాలను గుర్తించి, దాడులు నిర్వహిస్తారు. ఐపీ చిరునామాలు, సర్వర్ లాగ్స్, ట్రాన్సాక్షన్ ఐడీలు, నెట్వర్క్ రికార్డులను సేకరించి భద్రపరుస్తారు. డిజిటల్ ఆధారాలు సేకరించి నేరగాళ్లకు శిక్షలు పడేలా చూస్తారు.
నిఘా సమాచార సేకరణ, విశ్లేషణ…
సామాజిక మాధ్యమాలు, వెబ్సైట్లు, ఫోరంలలోని బహిరంగ సమాచారాన్ని సేకరిస్తారు. డార్వెబ్ మార్కెట్ ప్లేస్లు, హ్యాకర్ గ్రూపులు, ఎస్క్రిప్టెడ్ చాట్లలో జరిగే డేటా విక్రయాలు, మాల్వేర్ డీల్స్ను పర్యవేక్షిస్తారు. ఐపీ చిరునామాలు, డొమైన్ నేమ్లు, మాల్వేర్ శాంపిల్స్, సిస్టమ్ లాగ్లను రికార్డు చేస్తారు. నేరగాళ్లు వాడిన టెక్నిక్స్, ప్యాటర్న్ గమనిస్తారు. దాడులు, నేరాలను ముందుగానే అంచనా వేసి హెచ్చరికలు జారీచేస్తారు.
డిజిటల్ ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్..
సైబర్ నేరాల్లో వాడిన డిజిటల్ పరికరాల నుంచి సాక్ష్యాలు, ఆధారాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరిస్తారు.
నేరగాళ్లు వాడిన కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్లు, పెన్దెవ్లోని డేటాను రికవరీ చేసి, భద్రపరుస్తారు.. విశ్లేషిస్తారు. ఆ ఆధారాలను న్యాయస్థానాల్లో సమర్పించేందుకు వీలుగా నివేదికలు రూపొందిస్తారు.
ఆన్లైన్ ఆధారిత నేరాల దర్యాప్తు..
సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొత్తు.. ఏయే మ్యూల్ ఖాతాలకు, డిజిటల్ వాలెట్లకు, క్రిప్టో కరెన్సీకి మళ్లిందో సిబ్బంది ట్రాక్ చేస్తారు. ఆ సొత్తును నేరగాళ్లు తీసుకోకుండా వెంటనే ఖాతాలను స్తంభింపజేస్తారు.
బాధితులు 1930 టోలీఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదిస్తే.. సంబంధిత బ్యాంకులకు వెంటనే ఆటోమేటెడ్ సందేశాలు వెళ్లేలా చూస్తారు. దోచేసిన సొత్తును విత్ డ్రా చేసే వీల్లేకుండా హోల్డ్ పెడతారు.
ముందుగానే ముప్పు గుర్తింపు….
రాష్ట్ర పరిధిలోని ప్రభుత్వ డిజిటల్ మౌలిక సదుపాయాలు, కీలక రంగాల నెట్వర్క్లపై సైబర్ దాడులు జరగక ముందే ముప్పు గుర్తిస్తారు. అనధికార లాగిన్ యత్నాలు, పరిమితికి మించి డేటా బదిలీ తదితర అనుమానాస్పద చర్యలను కృత్రిమ మేధతో పసిగడతారు. కొత్తగా వస్తున్న మాల్వేర్లు, వైరస్లు, అంతర్జాతీయ హ్యాకింగ్ గ్రూపుల వ్యూహాల సమాచారాన్ని సేకరించి సిస్టమ్లను నవీకరిస్తారు.
కన్నేస్తారు.. పట్టేస్తారు…
నేరపూరిత డిజిటల్ కార్యకలాపాలను గుర్తించేందుకు సైబర్ గస్తీ నిర్వహిస్తారు. సామాజిక మాధ్యమాలు, వెబ్సైట్లలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు, దేశభద్రతకు భంగం కలిగించే, హింసను ప్రేరేపించే, విద్వేషాలు రెచ్చగొట్టే సమాచారాన్ని పరిశీలిస్తారు. ఆన్లైన్ వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ తదితరాలను ముందే గుర్తించి అడ్డుకుంటారు. ఫిషింగ్ లింక్లు, నకిలీ పెట్టుబడి యాప్లు, మోసపూరిత ప్రకటనలు, నకిలీ వెబ్సైట్లను ఎప్పటికప్పుడు బ్లాక్ చేస్తారు. డార్నెట్లో జరిగే అక్రమ ఆయుధాల విక్రయం, మత్తు పదార్థాల సరఫరా, హ్యాకింగ్ టూల్స్, దొంగిలించిన డేటా విక్రయాలపై కన్నేసి ఉంచుతారు. దర్యాప్తు అధికారులకు సంక్లిష్ట సాంకేతిక విషయాల్లో తక్షణ సాయం, విశ్లేషణ, నైపుణ్యాన్ని అందించేందుకు టెక్నికల్ అసిస్టెన్స్ యూనిట్.. సైబర్ గార్డ్లో అంతర్భాగంగా ఉంటుంది. సైబర్ నేరాలను అరికట్టడానికి, బాధితుల ఆర్థికనష్టాన్ని తగ్గించటానికి, దర్యాప్తు సంస్థలు, బ్యాంకులు, ఫైనాన్షియల్ గేట్వేలు, టెలికాం సంస్థలతో కలిసి పోలీసులు ఇక్కడి నుంచి పనిచేస్తారు.
Tags: Ready to battle cybercrime… ‘Cyber Guard’ is coming!