అమరావతిముచ్చట్లు:
ఫోన్ మోగగానే అవతలి వైపు వినిపించిన అమ్మాయి తియ్యని గొంతు ఆ యువకుడికి రెండేళ్ల సంసార అనుభూతిని పంచింది. ‘రాంగ్ నెంబర్’ అంటూ మొదలైన ఆ పరిచయం క్రమేణా ప్రేమగా మారింది. తీపి మాటలకు కరిగిపోయిన ఆ అమాయక కుర్రాడు, చివరకు ఆన్ లైన్ కిలాడీ వేసిన హనీట్రాప్ వలలో చిక్కుకుని ఏకంగా రూ.4 లక్షలు సమర్పించుకోవాల్సి వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన ఓ యువకుడి సెల్‌ఫోన్‌కు అనుకోకుండా ఒక నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతలి వైపు నుంచి ఓ యువతి గొంతు వినిపించింది. ‘సారీ అండీ.. రాంగ్ నెంబర్’ అంటూనే అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేయకుండా మాటలు కలిపింది. మాటల్లోని తియ్యదనం ఆ యువకుడిని ఇట్టే కరిగించేసింది. రోజూ గంటల తరబడి సాగిన ఆ ఫోన్ సంభాషణలు కాస్తా చివరకు ప్రేమ మైకంలోకి దారితీశాయి.
ఈ చనువు మరింత పెరిగిన తర్వాత సదరు యువతి వీడియో కాల్ చేయాలని కోరింది. ఉత్సాహంతో ఉబ్బితబ్బిబ్బైన ఆ కుర్రాడు వెంటనే వీడియో కాల్ ఆన్ చేశాడు. ఇటువైపు నుంచి సంభాషణ సాగుతున్న సమయంలో యువతి మాటలకు రెచ్చిపోయిన ఆ యువకుడు.. తన సిక్స్ ప్యాక్ బాడీని కెమెరా ముందు ప్రదర్శించాడు. అయితే ఆ మాయలేడి చేస్తున్న కుట్ర ఏమిటో ఆ సమయంలో ఆ పిచ్చోడికి అర్ధం కాలేదు. కెమెరా ముందు జరిగిన ఆ ప్రైవేట్ తంతు మొత్తాన్ని ఆ కిలాడీ లేడీ అత్యంత చాకచక్యంగా రికార్డ్ చేసింది.
వీడియో కాల్ కట్ అయిన క్షణాల వ్యవధిలోనే ఆ యువతి అసలు రూపం బయటపెట్టింది. రికార్డ్ చేసిన ఆ ప్రైవేట్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు దిగింది. పరువు పోతుందన్న భయంతో వణికిపోయిన ఆ యువకుడు అడిగిన వెంటనే రూ.2 లక్షలు ఆమె అకౌంట్‌కు బదిలీ చేశాడు.
అయినా ఆ ఘరానా మహిళలో ఆశ చావలేదు. కొద్ది రోజులకే మళ్లీ ఫోన్ చేసి మరో రూ.2 లక్షలు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది. ఎంత ఇస్తున్నా ఆమె డిమాండ్లు పెరుగుతుండటంతో విసిగిపోయిన బాధితుడికి ఆలస్యంగా జ్ఞానోదయం కలిగింది. పరువుపోతే పోయింది కానీ ఈ కిలాడీ చేతిలో మోసపోతే జీవితం నాశనమవుతుందని భావించిన ఆ యువకుడు, నేరుగా సైబర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
బాధితుడి ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు టెక్నికల్ ఆధారాలతో ఆచూకీ రాబట్టారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో తలదాచుకున్న ఆ హనీట్రాప్ కిలాడీని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. సోషల్ మీడియాలో, ఫోన్లలో పరిచయం లేని వ్యక్తులతో స్నేహం ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటనే మరోసారి కళ్లకు కట్టింది.
Tags: ‘Wrong number’ trap… honey-trap using the lure of a six-pack body…!!