August 30, 2026
Explore
ఎవరెస్ట్‌, ఎల్‌జీ ఇంగువపై నిషేధం

ఎవరెస్ట్‌, ఎల్‌జీ ఇంగువపై నిషేధం

August 30, 2026 | Andhra Pradesh

నాణ్యతా లోపాలతో తాత్కాలిక బ్యాన్‌

భారత ఆహార భద్రతా సంస్థ చర్యలు

మార్కెట్‌లో ఉన్న ఉత్పత్తులూ వెనక్కి

3 రకాల ఎవరెస్ట్‌ మసాలాల్లో నాణ్యతలేమి

న్యూఢిల్లీ ముచ్చట్లు:

నాణ్యతాపరమైన లోపాల కారణంగా ప్రముఖ మసాలా దినుసుల తయారీ కంపెనీలు ఎవరెస్ట్‌ ఫుడ్‌ ప్రోడక్ట్స్‌, లాల్‌జీ గోధూ (ఎల్‌జీ)లపై భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ కొరడా ఝళిపించింది.

ఆయా కంపెనీల ‘ఇంగువ’ అమ్మకాలపై శనివారం తాత్కాలిక నిషేధం విధించింది. మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న స్టాక్‌ను స్వచ్ఛందంగా వెనక్కి తీసుకోవడంతో పాటు ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలని, భవిష్యత్తులో సంబంధిత ఆహార ప్రమాణాలను ఎలా పాటిస్తారో తెలుపుతూ ఒక కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని ఆదేశించింది. నిబంధనలు పాటించే వరకూ నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. తప్పులను సవరించుకోకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అదేవిధంగా ఎవరెస్టు సంస్థకు చెందిన ఎగ్‌ కర్రీ మసాలా, చికెన్‌ మసాలా, గరం మసాలా ఉత్పత్తుల తయారీలోనూ నిబంధనలు పాటించడం లేదని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ గుర్తించింది. అయితే ఆ ఉత్పత్తుల అమ్మకాలపై ప్రస్తుతానికి ఎలాంటి నిషేధం విధించలేదు.

ల్యాబ్‌ టెస్టుల్లో ఏం తేలింది?

ఓ వినియోగదారుడి ఫిర్యాదు మేరకు మహారాష్ట్ర, గుజరాత్‌లోని ఎవరెస్ట్‌, ఎల్‌జీ యూనిట్లలో ఉన్న ఇంగువ శాంపిల్స్‌ను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పరీక్షించింది. నిబంధనల ప్రకారం.. కాంపౌండెడ్‌ ఇంగువలో కనీసంగా 5శాతం ఆల్కాహాల్‌-సోలబుల్‌ ఎక్స్‌ట్రాక్ట్‌ ఉండాలి. అయితే ఎఫ్‌ఎస్ఎస్‌-2011 నిబంధనలకు విరుద్ధంగా ఆయా శాంపిళ్లలో 0-3శాతం మాత్రమే ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. అంటే అవసరమైన దాని కంటే 30-40శాతం తక్కువగా ముడి ఇంగువను ఉపయోగిస్తున్నారని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ తెలిపింది. ఎల్‌జీ యూనిట్‌ నుంచి సేకరించిన ఆరు రకాల ముడి ఇంగువలో 15-32శాతం పిండి పదార్థం (స్టార్చ్‌) ఉన్నట్లు గుర్తించారు. ఇది గరిష్ఠ పరిమితి అయిన 1 శాతం కంటే చాలా ఎక్కువ కావడం గమనార్హం.

Tags: Ban on Everest and LG Asafoetida