August 29, 2026
Explore
మద్యం మత్తులో దాడి.. వ్యక్తి మృతి

మద్యం మత్తులో దాడి.. వ్యక్తి మృతి

August 29, 2026 | Andhra Pradesh

పాకాలలో ముగ్గురు నిందితుల అరెస్ట్‌

పాకాల ముచ్చట్లు:

మద్యం మత్తులో వ్యక్తిపై దాడి చేసి, అతడి మృతికి కారణమైన ముగ్గురు నిందితులను పాకాల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల మేరకు.. ఆకుల కిరణ్‌ (33)కు నిఖిల్‌ (20), మహాసముద్రం రూపేష్‌ (20), పాకాల నరేష్‌రెడ్డి (24)తో గతంలో పరిచయం ఉంది. ఈ నెల 22న దామలచెరువు వైన్‌షాప్‌ సమీపంలో కిరణ్‌ను తమ వెంట తీసుకెళ్లిన నిందితులు మామిడి తోటలో మద్యం సేవించారు. అక్కడ గొడవ జరగడంతో కిరణ్‌ను వదిలి వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి కుక్కలపల్లి సమీపంలోని మామిడికాయల ర్యాంపు వద్ద నిందితులు మద్యం సేవిస్తుండగా కిరణ్‌ అక్కడికి వచ్చి తనను పిలవకుండా మద్యం సేవిస్తున్నారంటూ వారితో గొడవపడ్డాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న ముగ్గురు అతడిపై చేతులు, కాళ్లతో దాడి చేసి ర్యాంపుపై నుంచి కిందకు తోసివేశారు. తీవ్రంగా గాయపడిన కిరణ్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. తొలుత హత్యాయత్నం కేసుగా నమోదు చేసిన పోలీసులు, కిరణ్‌ మృతి చెందడంతో హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు ఆదేశాలతో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టగా, విశ్వసనీయ సమాచారంతో శనివారం ఉదయం 8.30 గంటలకు నేండ్రగుంట ఫ్లైఓవర్‌ వద్ద ముగ్గురు నిందితులను పాకాల సీఐ టి. చిన్న గోవిందు అరెస్ట్‌ చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.

Tags: Man dies after being attacked while intoxicated