తిరుమల ముచ్చట్లు:
టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు
టీటీడీ ఆసుపత్రుల్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలియజేశారు. స్విమ్స్ నూతన డైరెక్టర్ గా నియమితులైన డాక్టర్ జగదీష్ గురువారం ఉదయం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ జగదీష్ ను చైర్మన్ అభినందించారు.
అనంతరం చైర్మన్ విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్విమ్స్ హాస్పిటల్ కు డాక్టర్ జగదీష్ ను డైరెక్టర్ గా నియమించడం జరిగిందన్నారు. చాలా అనుభవజ్ఞులైన, గొప్ప పేరు, దూరదృష్టి గల వైద్యులైన డాక్టర్ జగదీష్ నేతృత్వంలో స్విమ్స్ ఆసుపత్రిలో అత్యున్నతమైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు.
స్విమ్స్ ఆసుపత్రిని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని, త్వరలో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేశారు.
స్విమ్స్ నూతన డైరెక్టర్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పం మేరకు, చైర్మన్ బిఆర్ నాయుడు, ఈఓ రవిచంద్ర సూచనలు ప్రకారం స్విమ్స్ ఆసుపత్రిని ను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
తిరుపతిని ఇంటిగ్రేటెడ్ మెడికల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తామని, స్విమ్స్ ఆసుపత్రిలో వైద్యంపై రోగుల్లో నమ్మకం కలగించి ఎప్పటికప్పుడు అత్యాధునిక వైద్యం అందించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్యసేవలను మరింత విస్తరించి పేదరోగులకు ఆర్థిక భారం తగ్గిస్తామని తెలియజేశారు.
Tags: Even better medical services in TTD hospitals