తంబళ్లపల్లి ముచ్చట్లు:
తంబళ్లపల్లి నియోజకవర్గంలో రూ.4.20 కోట్ల పనులను పరిశీలించిన – జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
మార్చి 31లోపు అన్ని పనులు నాణ్యతగా పూర్తి చేయాలి
గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉపాధి హామీ అనుసంధానం నిధులతో చేపట్టిన మౌలిక వసతుల పనులను వేగవంతం చేసి నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
గురువారం ఉదయం తంబళ్లపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ విస్తృత పర్యటన నిర్వహించి, సుమారు రూ.4.20 కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్లు, కాలువల నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిని సమీక్షిస్తూ సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీలు మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన జీవన విధానాన్ని అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ దిశగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ రవాణా, డ్రైనేజీ, సిమెంట్ రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత 45 రోజుల్లో జిల్లాలో రూ.37 కోట్ల అంచనాతో 92 కిలోమీటర్ల కొత్త రహదారుల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. అన్ని పనులను నాణ్యత ప్రమాణాలతో మార్చి 31 లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
శ్రీనివాస కాలనీలో రూ.36 లక్షలతో నిర్మాణంలో ఉన్న సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ పనులను, అలాగే తంబళ్లపల్లి ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో రూ.35 లక్షలతో చేపట్టిన పనులను పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థలో నీరు నిల్వ కాకుండా సజావుగా ప్రవహించేలా చూడాలని, ప్రతి ఇంటి పైప్ కనెక్షన్లు ప్రధాన డ్రైనేజీకి అనుసంధానం చేయాలని సూచించారు. అదేవిధంగా, డ్రైనేజీల్లో చెత్త చేరకుండా ఐరన్ మెష్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
బస్టాండ్ రోడ్డును 3.75 మీటర్ల నుండి 5.5 మీటర్లకు విస్తరించి ఇంటర్మీడియట్ రోడ్డు గా మార్చే ప్రతిపాదనలు సిద్ధం చేసి, త్వరితగతిన పనులు ప్రారంభించాలని ఆదేశించారు. బస్సుల రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, చిన్నపాటి మరమ్మతులు కూడా వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
రైతుల ఆర్థికాభివృద్ధికి ఎఫ్‌పీవోలు:
తంబళ్లపల్లి మండలంలోని రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సంఘం (FPO) కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతుల ఆర్థికాభివృద్ధికి ఇటువంటి కేంద్రాలు కీలకమని పేర్కొన్నారు. రైతుల నుండి నేరుగా హార్టికల్చర్ పంటలను సేకరించి, గ్రేడింగ్, నాణ్యమైన ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ చేయడం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం తగ్గి రైతులకు మెరుగైన ధరలు లభిస్తాయని తెలిపారు. గ్రామీణ స్థాయిలో మరిన్ని ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేసి రైతులను సమూహాలుగా బలోపేతం చేయాలని, తద్వారా వ్యవసాయ రంగానికి మరింత ఉత్సాహం చేకూరుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ఈఈ చంద్రశేఖర్, హార్టికల్చర్ అధికారి సుభాషిని, డిపిఓ రాధమ్మ, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంఈఓ త్యాగరాజు, డీఈ మునిరాజా, జేఈ వెంకటరమణ, మండల అభివృద్ధి అధికారి తదితరులు పాల్గొన్నారు.
Tags: Boost for rural development with NREGS funds