సంబేపల్లె ముచ్చట్లు:
సంబేపల్లె బంధువుల వివాహానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన ఆ కుటుంబంలో అంతలోనే విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రుల కళ్లెదుటే రోడ్డు ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలిక మృత్యువాతపడింది. అప్పటివరకు ఆనందంగా ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
సంబేపల్లె మండల పరిధిలో బుధవారం రాత్రి జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఓ బాలిక మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై రవికుమార్ యాదవ్ తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారిపై దేవపట్ల కస్పాలో నాగం ఈశ్వరరెడ్డి, రమాదేవి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. వారికి కుమారుడు లిఖిత్ కుమార్రెడ్డి, కుమార్తె దేవర్షిణి (8) ఉన్నారు.
బుధవారం కుటుంబ సభ్యులు బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి వచ్చారు. అనంతరం తాళాల కోసం ఎదురుగా ఉన్న దుకాణం వద్దకు వెళ్లిన దేవర్షిణి తిరిగి వస్తూ రోడ్డు దాటుతుండగా, రాయచోటి వైపు నుంచి గొర్రెల లోడుతో వస్తున్న వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలిక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల కళ్లెదుటే కుమార్తె మృతిచెందడంతో వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబ సభ్యుల రోదనలతో సంఘటనా ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags: Girl dies a tragic death right before her parents’ eyes.