August 25, 2026
Explore
విద్యార్థినుల భద్రతే లక్ష్యం

విద్యార్థినుల భద్రతే లక్ష్యం

August 25, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

– మహిళా పోలీసుల ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమం.

  • తిరుపతి శ్రీ పద్మావతి పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో అవగాహన సదస్సు.
  • మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, సైబర్ నేరాలపై విద్యార్థినులకు అవగాహన.
  • బాల్య వివాహాలు, సోషల్ మీడియా దుష్ప్రభావాలు, మహిళల భద్రతా యాప్స్‌పై వివరాలు.
  • లక్ష్య సాధన దిశగా చదువుపై దృష్టి సారించాలని విద్యార్థినులకు సూచన.

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు, తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్ అదనపు ఎస్పీ ఎం. శ్రీలత ఆధ్వర్యంలో, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. థమీమ్ అహ్మద్ ఈ రోజు తిరుపతిలోని శ్రీ పద్మావతి పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో విద్యార్థినుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థినులకు మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, బాల్య వివాహాలు, చైల్డ్ పోర్నోగ్రఫీ, సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుష్ప్రభావాలు, అపరిచితులు మరియు చెడు స్నేహితుల వల్ల ఎదురయ్యే ప్రమాదాలు, అధికంగా సెల్‌ఫోన్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు వంటి అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు.

అదేవిధంగా మహిళల భద్రత కోసం అందుబాటులో ఉన్న సేఫ్టీ యాప్స్, డయల్-112, మహిళల హెల్ప్‌లైన్-181, చైల్డ్ హెల్ప్‌లైన్-1098, సైబర్ హెల్ప్‌లైన్-1930 వంటి అత్యవసర సేవల గురించి వివరించారు. ఏవైనా వేధింపులు, సైబర్ మోసాలు లేదా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనప్పుడు భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఎం. శ్రీలత మాట్లాడుతూ, విద్యార్థినులు తమ జీవిత లక్ష్యాలపై దృష్టి సారించి, క్రమశిక్షణతో చదువుకుంటూ ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. సైబర్ ప్రపంచంలో అప్రమత్తంగా ఉండటంతో పాటు సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని తెలిపారు.

ఈ అవగాహన కార్యక్రమంలో 300 మంది విద్యార్థినులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. మహిళలు, బాలికలు మరియు విద్యార్థినుల భద్రతపై అవగాహన పెంపొందించేందుకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Tags: Student safety is the goal.