August 22, 2026
Explore
వ్యాపార సంస్థల భద్రతపై ప్రత్యేక దృష్టి – చోరీల నివారణకు బహుళస్థాయి భద్రత.

వ్యాపార సంస్థల భద్రతపై ప్రత్యేక దృష్టి – చోరీల నివారణకు బహుళస్థాయి భద్రత.

August 22, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

చోరీ జరిగిన తర్వాత స్పందించడం కంటే.. ముందుగానే నివారించడమే ఉత్తమ భద్రతా చర్య జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు,

  • గోల్డ్ షాపులు, పాన్ బ్రోకర్లు, బ్యాంకులు, ఎలక్ట్రానిక్ షాపులు, ఆటో డీలర్ల ప్రతినిధులతో జిల్లా ఎస్పీ సమావేశం.
  • CCTVతో పాటు అలారం, సెన్సర్లు, మోషన్ డిటెక్షన్, నైట్ విజన్ కెమెరాలు, సెన్సార్ లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి.
  • CCTVలను ధ్వంసం చేసినా ఆధారాలు మిగిలేలా ప్రత్యామ్నాయ కెమెరాలు, సురక్షిత బ్యాకప్ ఏర్పాటు చేసుకోవాలి.
  • UPI, QR, POS, ఆన్‌లైన్ బ్యాంకింగ్, కంప్యూటర్లు, CCTV/DVRలకు సైబర్ భద్రత కల్పించాలి.
  • అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, సైబర్ మోసాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
  • పోలీసులు వ్యాపారులు–ప్రజలు సమన్వయంతో తిరుపతిని మరింత సురక్షిత జిల్లాగా తీర్చిదిద్దాలి.

తిరుపతి జిల్లాలో వ్యాపార సంస్థల్లో చోరీలను అరికట్టడం, వ్యాపారులు మరియు సంస్థల ఆస్తులు, నగదు, విలువైన వస్తువులకు భద్రత కల్పించడం లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గోల్డ్ షాపులు, పాన్ బ్రోకర్లు, బ్యాంకులు, ఎలక్ట్రానిక్ షాపులు, ఆటో డీలర్లు తదితర సంస్థల ప్రతినిధులతో తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారని, అదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి నేరస్థులు వచ్చే అవకాశాలను కూడా దృష్టిలో ఉంచుకుని వ్యాపార సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

దొంగతనం జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాదు.. అసలు దొంగతనం జరగకుండా ముందుగానే నివారించడమే మన ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు.

కేవలం CCTV కాదు.. బహుళస్థాయి భద్రత చాలా అవసరం, వ్యాపార సంస్థలు కేవలం CCTV లేదా సెక్యూరిటీ గార్డుపై ఆధారపడకుండా బహుళస్థాయి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.

ప్రధాన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, వెనుక ద్వారాలు, పైకప్పు మార్గాలు, కిటికీలు, పార్కింగ్ ప్రాంతాలు, సంస్థ పరిసరాలు స్పష్టంగా కనిపించేలా నాణ్యమైన CCTV కెమెరాలు, నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

షట్టర్లపై వైబ్రేషన్/సీస్మిక్ సెన్సర్లు, గాజు ప్రాంతాల్లో గ్లాస్ బ్రేక్ సెన్సర్లు, పరిసర ప్రాంతాల్లో మోషన్ డిటెక్షన్, ఇన్‌ట్రూజన్ అలర్ట్, సెన్సార్ లైటింగ్, నగదు కౌంటర్ల వద్ద Silent Panic Alarm వంటి భద్రతా వ్యవస్థలను అవసరానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

CCTV ధ్వంసమైనా ఆధారాలు మిగలాలి,
కెమెరా ఎక్కడ ఉందో దొంగకు ముందే అర్థం కాకుండా కొన్ని కెమెరాలను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయాలి. CCTVను పగులగొట్టి DVR/NVR తీసుకెళ్లినా కీలక ఆధారాలు నష్టపోకుండా ప్రత్యామ్నాయ కెమెరాలు, రిమోట్/క్లౌడ్ బ్యాకప్ ఉండాలి అని జిల్లా ఎస్పీ గారు సూచించారు.

అధిక విలువైన వస్తువులు, నగదు కలిగిన సంస్థలు అవసరమైన చోట ANPR/Number Plate Recognition Cameras ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

భౌతిక భద్రతతో పాటు సైబర్ భద్రత కూడా కీలకం,
ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపార సంస్థలకు భౌతిక చోరీలతో పాటు సైబర్ మోసాల నుంచి కూడా రక్షణ అవసరమని జిల్లా ఎస్పీ తెలిపారు.

UPI, QR, POS, ఆన్‌లైన్ బ్యాంకింగ్, కంప్యూటర్లు, CCTV/DVR/NVR, Wi-Fi, ఈ-మెయిల్ తదితర వ్యవస్థలకు బలమైన పాస్‌వర్డ్‌లు, Two-Factor Authentication, పరిమిత యాక్సెస్, సురక్షిత బ్యాకప్ వంటి చర్యలు పాటించాలని సూచించారు.

నకిలీ పేమెంట్ స్క్రీన్‌షాట్లు, QR కోడ్ మార్పులు, ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్, Remote Access Apps, OTP/పాస్‌వర్డ్‌లు అడిగే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సైబర్ మోసం జరిగినప్పుడు ఆలస్యం చేయకుండా సంబంధిత బ్యాంకు/పేమెంట్ సంస్థకు సమాచారం అందించడంతో పాటు 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ప్రతి వ్యాపార సంస్థ తమ భద్రతా వ్యవస్థపై క్రమం తప్పకుండా సెక్యూరిటీ ఆడిట్, నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.

CCTVలు పనిచేస్తున్నాయా, తేదీ–సమయం సరిగ్గా ఉందా, DVR/NVR మరియు బ్యాకప్ సురక్షితంగా ఉన్నాయా, షట్టర్లు, వెనుక మార్గాలు భద్రంగా ఉన్నాయా, సెన్సర్లు, అలారాలు పనిచేస్తున్నాయా అనే అంశాలను నిరంతరం తనిఖీ చేసి లోపాలను వెంటనే సరిచేసుకోవాలని తెలిపారు.

ఉద్యోగులు, సెక్యూరిటీ గార్డులు, తాత్కాలిక సిబ్బంది వివరాలను ధృవీకరించుకోవాలని, సంస్థ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని అనవసర వ్యక్తులతో పంచుకోవద్దని సూచించారు.

వ్యాపార సంస్థల భద్రతా వ్యవస్థలను పోలీసు కంట్రోల్ రూమ్/కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేసుకునే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. బ్యాంకు ప్రతినిధులు కూడా ఈ అంశంపై ఆసక్తి వ్యక్తం చేయగా, సాధ్యమైన విధానంలో సమన్వయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.

మీ షాపు భద్రత మాత్రమే కాదు.. మీ చుట్టుపక్కల ప్రాంతం భద్రత కూడా మీ బాధ్యతగా భావించాలి. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి, అని జిల్లా ఎస్పీ కోరారు.

తిరుపతిని సురక్షిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం, వ్యాపారులు ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తులు, నగదు, విలువైన వస్తువులకు భద్రత కల్పించడం అందరి బాధ్యత అని జిల్లా ఎస్పీ తెలిపారు.

పోలీసుల నిఘా ఒక్కటే సరిపోదు. వ్యాపారులు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు–వ్యాపారులు–ప్రజలు సమన్వయంతో పనిచేస్తే తిరుపతి జిల్లాను మరింత సురక్షితమైన జిల్లాగా తీర్చిదిద్దగలం, అని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాసులు (పరిపాలన), అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారి (శాంతిభద్రతలు), ఐ రామకృష్ణ (తిరుమల) తిరుపతి డీఎస్పీ శ్రీ భక్తవత్సలం, ఇతర పోలీసు అధికారులు, గోల్డ్ షాపులు, పాన్ బ్రోకర్లు, బ్యాంకులు, ఎలక్ట్రానిక్ షాపులు, ఆటో డీలర్లు తదితర వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:Special focus on the security of business establishments – multi-layered security to prevent thefts.