ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పక్కగా అమలు చేస్తున్నాం: జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లె ముచ్చట్లు:
జిల్లాలో నిర్వహించనున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా.. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నామని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కు వివరించారు.
బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మదనపల్లె కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల మ్యాపింగ్, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు, ఎన్నికల సామగ్రి అవసరాల అంచనా, సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ప్రతి పంచాయతీ, మండలం, మున్సిపాలిటీకి ఎన్నికల అధికారుల నియామకం తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని 411 గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి సమస్యలు లేవని తెలిపారు. పోల్ కమ్యూనికేషన్ ప్రక్రియ పూర్తయిందని, పోలీస్ స్టేషన్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైందని, నిర్ణయించిన గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేందుకు పనుల వేగాన్ని మరింత పెంచుతామని చెప్పారు.
కోర్టు కేసుల కారణంగా ప్రభావితమైన యూఎల్‌బిలకు సంబంధించి అవసరమైన సన్నాహక పనులు పూర్తయ్యాయని, తదుపరి కోర్టు తీర్పు మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని కలెక్టర్ వివరించారు.
జిల్లాలో సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాల గుర్తింపునకు సంబంధించి ఎన్నికల కమిషన్ నిర్దేశించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా ఎస్పీతో సమావేశం నిర్వహించి గొడవలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్నామని, ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గత ఒకటి రెండు నెలలుగా అసాంఘిక శక్తులపై నిఘా, నియంత్రణ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను ఇతర జిల్లాల నుంచి సమకూర్చుకోవాల్సి ఉందని, ఇందుకోసం అధికారులను పంపించి అవసరమైన సమాచారాన్ని త్వరలో అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన అన్ని సూచనలు, మార్గదర్శకాలను నమోదు చేసుకున్నామని, వాటిని నిబంధనల ప్రకారం అమలు చేస్తూ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో వెంకటేష్, జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ, ఎస్జీఎస్డబ్ల్యూ జిల్లా అధికారి అమర్నాథ్ రెడ్డి, మదనపల్లె, రాయచోటి, పుంగనూరు, బి.కొత్తకోట మున్సిపల్ కమిషనర్లు ప్రమీల, రమణారెడ్డి, మధుసూదన్ రెడ్డి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Tags: Elaborate arrangements for local body elections in the district.