August 12, 2026
Explore
ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు TET నుంచి పూర్తి మినహాయింపు కల్పించాలి

ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు TET నుంచి పూర్తి మినహాయింపు కల్పించాలి

August 12, 2026 | Andhra Pradesh

తాడేపల్లిముచ్చట్లు:

అవసరమైతే చట్ట సవరణ చేయాలని కేంద్రాన్ని కోరనున్న ఉపాధ్యాయ సంఘాల బృందం

వైయస్‌ జగన్‌ చొరవతో రేపు కేంద్ర విద్యాశాఖ మంత్రితో భేటీ

వైఎస్సార్‌సీపీ ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, సంఘాల నేతలు

రాష్ట్రంలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET) నుంచి పూర్తి మినహాయింపు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, వైయస్‌ఆర్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ఏపీ (YSRTA AP) సహా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఇప్పటికే ఉద్యోగంలో కొనసాగుతున్న వేలాది మంది ఉపాధ్యాయులు పదోన్నతులు, ఇతర సర్వీస్‌ ప్రయోజనాల కోసం మళ్లీ TET రాయాల్సి వస్తుండటం తీవ్ర ఇబ్బందికరంగా మారిందని వారు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీర్ఘకాలంగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారికి TET నిబంధన గుదిబండగా మారిందని, కేవలం ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల్లో మార్పులు చేయడం కాకుండా ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు TET నుంచి పూర్తిస్థాయి మినహాయింపు కల్పించేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలని కోరారు.

ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తిపై స్పందించిన వైయస్‌ జగన్‌, ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన కేంద్ర విద్యాశాఖ మంత్రితో ప్రత్యేక భేటీకి ఏర్పాట్లు చేశారు.

ఈ భేటీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ సంఘాల నేతలతో కూడిన ప్రతినిధి బృందంతో పాటు వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ సభ్యులు కూడా పాల్గొననున్నారు. రాష్ట్రంలోని ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రతను కేంద్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, TET నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నారు.

ఢిల్లీ వెళ్లనున్న ప్రతినిధి బృందం

ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు: ఎం.వి.రామచంద్రారెడ్డి, కె.కల్పలత, పి.చంద్రశేఖర్‌ రెడ్డి,

ఉపాధ్యాయ సంఘాల నేతలు: కేశవరపు జాలి రెడ్డి – APYSRTA రాష్ట్ర అధ్యక్షుడు, షేక్‌ జంషీద్‌ – APYSRTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సి.కె. వెంకటనాథ రెడ్డి – APYSRTA రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పి. అశోక్‌ కుమార్‌ – APYSRTA రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ఎస్‌. అమరనాథ్‌ – APYSRTA కడప జిల్లా అధ్యక్షుడు, ఎన్‌. సంగమేశ్వర్‌ – STU కడప జిల్లా అధ్యక్షుడు, FAFTO కడప జిల్లా అధ్యక్షుడు

ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్‌కు పరిష్కారం లభించేలా కేంద్రంతో చర్చించాలని ప్రతినిధులు శ్రీ వైయస్‌ జగన్‌ను కోరగా, సమస్య పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

వైయస్‌ జగన్‌, ఎంపీ వైయస్‌ అవినాష్‌ రెడ్డి చొరవతో జరుగుతున్న ఈ భేటీ ద్వారా రాష్ట్రంలోని వేలాది మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు TET సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags: In-service teachers should be granted a complete exemption from TET.