March 26, 2026
Explore
ఇంజనీరింగ్ విద్యార్థిపై గంజాయి బ్యాచ్ దాడి.. రాయచోటిలో కలకలం

ఇంజనీరింగ్ విద్యార్థిపై గంజాయి బ్యాచ్ దాడి.. రాయచోటిలో కలకలం

March 26, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి పట్టణంలో ఇంజనీరింగ్ విద్యార్థిపై గంజాయి మత్తులో ఉన్న గ్యాంగ్ విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది.

బాధితుల కథనం మేరకు, కొత్తపేట రామాపురంకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి లతీష్ కుమార్ తన స్నేహితులతో కలిసి మంగళ కాలనీ సమీపంలో సాయంత్రం క్రికెట్ ఆడుతుండగా, ఎస్.ఎన్.కాలనీ, చెక్‌పోస్ట్, కొత్తపేట ప్రాంతాలకు చెందిన గంజాయి బ్యాచ్ అకస్మాత్తుగా అక్కడికి చేరుకుంది. కొంత మంది గంజాయి మత్తులో రాడ్లు, కత్తులు, కట్టెలు, బీరు బాటిల్లతో దాడికి పాల్పడ్డారు.

దాడి భయంతో అక్కడున్న యువకులు పరుగులు తీయగా, లతీష్ కుమార్ గ్యాంగ్‌కు చిక్కి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటన జరిగి రెండు గంటల వరకు పోలీసులకు సమాచారం లేకపోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే గంజాయి బ్యాచ్ గతంలో కూడా పలుమార్లు దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలో అల్లరి మూకలు స్వేచ్ఛగా తిరుగుతూ ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయని, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు రాయచోటి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags: Marijuana Gang Attacks Engineering Student; Sparks Uproar in Rayachoti