March 26, 2026
Explore
ప్రారంభానికి నోచుకోని సచివాలయం… ప్రజల్లో ఆగ్రహం

ప్రారంభానికి నోచుకోని సచివాలయం… ప్రజల్లో ఆగ్రహం

March 26, 2026 | Andhra Pradesh

నందలూరు ముచ్చట్లు:

నందలూరు మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీలో సచివాలయం-1 నిర్మాణం పూర్తై ఏడేళ్లు గడిచినా ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రేపుతోంది.

సుమారు రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ సచివాలయం పూర్తయి ఉపయోగానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ ఆలస్యం కారణంగా ప్రారంభం వాయిదా పడుతూనే ఉందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చిన్నపాటి విద్యుత్ పనులు మినహా మిగతా పనులు పూర్తయ్యాయని, అయినా కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడంలో అధికారులు ఆసక్తి చూపడంలేదని విమర్శిస్తున్నారు.

ఇదిలా ఉండగా, సచివాలయం సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం గ్రామపంచాయతీ, సచివాలయ సేవలను అద్దె భవనాల్లో నిర్వహిస్తూ లక్షల రూపాయల ప్రజాధనం వృథా చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై పలు మార్లు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు చేసినా స్పందన లేదని చెబుతున్నారు.

గతంలో బాగానే పనిచేస్తున్న పంచాయతీ కార్యాలయాన్ని కూల్చివేసి కొత్త భవనం నిర్మించడంపై కూడా స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో పాత కార్యాలయాన్ని అలాగే ఉంచి పక్కనే కొత్త సచివాలయాలు నిర్మించగా, ఇక్కడ మాత్రం భిన్నంగా వ్యవహరించారని విమర్శలు ఉన్నాయి.

ప్రస్తుత పాలకవర్గం కూడా పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో, ఈ ఆలస్యానికి రాజకీయ కారణాలున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మిగిలిన పనులు పూర్తి చేసి సచివాలయాన్ని ప్రారంభించి ప్రజలకు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Tags: Secretariat Fails to Open… Public Outraged