అమరావతిముచ్చట్లు:
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విధానంలో కీలక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లను ఇకపై ప్రజలే నేరుగా ఎన్నుకునే ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని అమలు చేసే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం అమలైతే స్థానిక సంస్థలు మరింత బలోపేతం కావడంతో పాటు అవిశ్వాస తీర్మానాల సమస్యకు కూడా చెక్ పడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం ఎంపీపీలను ఎంపీటీసీలు, జెడ్పీ చైర్మన్లను జెడ్పీటీసీలు ఎన్నుకుంటున్నారు.
స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై నేడు ఎస్ఈసీ సమీక్ష
ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర నేడు (గురువారం) కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, చేపట్టాల్సిన చర్యలు, శాఖల సమన్వయం తదితర అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. ఈ సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల ముఖ్యకార్యదర్శులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కమిషనర్లు హాజరుకానున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణపై ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Tags: AP government’s key decision…??? Changes to local body elections???