శ్రీ సత్య సాయి జిల్లా ముచ్చట్లు:
జిల్లా వ్యాప్తంగా 11 మంది వాహనదారులకు రూ.1,00,000 జరిమానా – ఒకరికి 7 రోజుల రిమాండ్..
మద్యం సేవించి వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్
శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 11 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, మొత్తం రూ.1,00,000 జరిమానాలు విధించారు. అదనంగా ఒక వ్యక్తికి న్యాయస్థానం 7 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
కదిరి పట్టణంలో ప్రత్యేక తనిఖీలు
కదిరి టౌన్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు బాబ్జాన్ మరియు ధనుంజయ రెడ్డి ఆధ్వర్యంలో కదిరి పట్టణ పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 7 మందిని గుర్తించి, బుధవారం గౌరవనీయులైన రెండవ అదనపు న్యాయమూర్తి వారి ఎదుట హాజరుపరిచారు.
విచారణ అనంతరం 6 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.60,000 జరిమానా విధించగా, మరో వ్యక్తికి 7 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో చర్యలు
పట్నం, ఎన్.పి.కుంట మరియు ఆగలి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో నలుగురు వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.40,000 జరిమానా విధించారు.
ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి..
మద్యం సేవించి వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమే కాకుండా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసే చర్యలు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించి, మద్యం సేవించిన అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపకూడదని జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ సూచించారు.
ప్రజల ప్రాణ భద్రతకు భంగం కలిగించే విధంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపైనా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపైనా చట్టపరంగా కఠిన చర్యలు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
Tags:Sri Sathya Sai district police take strict action against drunk driving.