August 4, 2026
Explore
తిరుపతి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం.

తిరుపతి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం.

August 4, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • ఎం.ఆర్. పల్లి మోడల్ ప్రైమరీ స్కూల్‌లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన.
  • హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్ ప్రాముఖ్యత వివరించిన పోలీసులు.
  • ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారానే ప్రమాదాల నివారణ సాధ్యమని సూచన.

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలను పోలీసు శాఖ నిరంతరం నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమాల్లో భాగంగా తిరుపతి నగరంలోని ఎం.ఆర్. పల్లి మోడల్ ప్రైమరీ స్కూల్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రహదారి భద్రతకు సంబంధించిన మౌలిక నియమాలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించి, చిన్నప్పటి నుంచే ట్రాఫిక్ క్రమశిక్షణ అలవర్చుకోవాల్సిన అవసరాన్ని తెలియజేశారు.

ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను కచ్చితంగా పాటించాలని, రహదారిని దాటే సమయంలో జీబ్రా క్రాసింగ్‌ను మాత్రమే వినియోగించాలని సూచించారు. అలాగే వాహనాల వేగ నియంత్రణ, అప్రమత్తమైన డ్రైవింగ్, రోడ్డు భద్రతా నియమాల పాటన ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు.

ఈ కార్యక్రమాన్ని తిరుపతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎ. సంజీవ్‌కుమార్ నిర్వహించి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించడం ద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రక్షించవచ్చని తెలిపారు.ప్రజల ప్రాణ రక్షణే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, రోడ్డు భద్రత విషయంలో ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరించి ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సూచనలు చేశారు.

Tags: Awareness program organized by the Tirupati Traffic Police.