- తల్లిదండ్రులకు రూ.2 లక్షలు ఇచ్చి బెదిరించి పంపేశారు
-పసికందు ఏమైంది
-కర్నాటకలో పోక్సో కేసు నమోదు
-ఆర్‌ఎంపి ఈశ్వరమ్మ అరెస్ట్
పుంగనూరుముచ్చట్లు:
వైద్యవృత్తిని దిగజార్చి , నిబంధనలను ప్రక్కన పెట్టి మైనర్ బాలికకు ప్రసవం చేసి , ఆబిడ్డ కుటుంబ సభ్యులను బెదిరించి వారికి రూ.2 లక్షలు ఇచ్చి పంపి , బిడ్డను మాయం చేసిన పుంగనూరు వైద్యుల గురించి ఆలస్యంగా వెలుగు చూసిన హేయమైన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు పట్టణం సుబ్రమణ్యపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉన్న ఓ దంపతులకు మైనర్ కుమారై ఉంది. ఇలా ఉండగా బాలిక అక్క కొడుకు బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను గర్భవతిని చేశాడు. ఈ విషయం బయటపడితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. అప్పటితో అలా ఈ సంఘటనతో బాలిక గర్భవతైంది. బాలికకు రుతుశ్రావం జరగలేదని తల్లిదండ్రులు డాక్టర్ల వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి బాలిక గర్భవతిగా నిర్ధారించారు. ఈ సంఘటన బయట పడితే కుటుంబం పరువు పోతుందని తల్లిదండ్రులు తమకు సమీప బంధువు పుంగనూరులో ఉండటంతో పుంగనూరుకు మైనర్ బాలికను తీసుకుని వచ్చారు. గత నెల 2న పుంగనూరుకు వచ్చిన మైనర్ బాలికను స్థానిక ఆర్‌ఎంపి ఈశ్వరమ్మ , వైద్యాధికారికి చెందిన స్కానింగ్, సర్జికల్ సెంటర్‌కు తీసుకెళ్లి వ్యాపారం కుదుర్చుకున్నారు. వెంటనే బాలికను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి, అక్కడ ప్రసవం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గత నెల 5న మైనర్ బాలిక కుటుంభానికి బలవంతంగా రూ.2లక్షలు ఇచ్చి , ఈ విషయం బయట పెడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించి, పసికందును తీసుకుని మైనర్ బాలికను , వారి తల్లిదండ్రులను పంపేశారు. బెంగళూరుకు వెళ్లిన మైనర్ బాలికకు గత నెల 7న రాత్రి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆమెను బెంగళూరులోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్సలు నిర్వహించి, వివరాలను అక్కడ వైద్యులకు తెలిపారు.
పసికందు ఏమైంది…..
మైనర్ బాలికకు జన్మించిన పసికందు ఏమైంది. పసికందును అధిక లాభాలకు విక్రయించారని సమాచారం పోలీసులకు తెలిసింది. దీనిపై పసికందును కొనుగోలు చేసిన వ్యక్తిని సంప్రదించేందుకు ప్రయత్నించగా అతని ఫోన్ ఆఫ్ చేసి ఉండటంతో ప్రస్తుతం పూర్తి వివరాలు తెలియరాలేదు.
మైనర్లకు ప్రసవం చేయచ్చా…..
మైనర్ బాలికలకు ప్రసవం చేసేందుకు వైద్యులకు అనుమతి ఉంది. కానీ ఆ సమయంలో వైద్యులు ఈ సమాచారాన్ని సంబంధిత పోలీసులకు,వైద్యాధికారులకు తెలియజేయాలి. కానీ ఇక్కడ కాసులకు కకుర్తి పడిన వైద్యులు నిబంధనలను గాలికి వదిలివేయడంతో చిక్కుల్లో పడ్డారు.
కేసు నమోదు….
దీనిపై కర్నాటక పోలీసులు క్రైమ్ నెంబరు :179/2026 గా నమోదు చేసి, పోక్సో , తదితర నేరాలపై దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా కర్నాటక పోలీసులు పుంగనూరుకు వచ్చి మెడికల్ ఆఫీసర్‌ను, ఆయనకు చెందిన ఆసుపత్రిని, ఆర్‌ఎంపి వైద్యశాలను పరిశీలించారు. రాత్రి ఆర్‌ఎంపి ఈశ్వరమ్మను పోలీసులు అదుపులోనికి తీసుకుని కర్నాటకాకు తీసుకెళ్లారు. ఈకేసులో వైద్యులు, స్కానింగ్ , సర్జికల్ సెంటర్‌తో పాటు సంబంధం ఉన్న వారందరిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Tags: Medical Officer and RMP deliver baby for minor girl.